స్టూడెంట్ల పట్ల అసభ్య ప్రవర్తన.. పీడీకి దేహశుద్ధి.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మోడల్ స్కూల్ లో ఘటన

స్టూడెంట్ల పట్ల అసభ్య ప్రవర్తన.. పీడీకి దేహశుద్ధి.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మోడల్ స్కూల్ లో ఘటన

బెజ్జంకి, వెలుగు : స్టూడెంట్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఫిజికల్ డైరెక్టర్ కు స్టూడెంట్ల తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మోడల్ స్కూల్ పీఈటీ కనకారెడ్డి కొంతకాలంగా స్టూడెంట్లతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. విషయాన్ని స్టూడెంట్లు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో వారంతా తమ పేరెంట్స్ కు చెప్పారు. దీంతో వారు సోమవారం స్కూల్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న పీడీ కనకారెడ్డితో పాటు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు స్కూల్ వద్దకు వచ్చి పేరెంట్స్ తో మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో పీడీ కనకారెడ్డి రావడంతో ఆగ్రహానికి గురైన స్టూడెంట్ల తల్లిదండ్రులు అతడిపై దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు అతడిని పక్కకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ మహంతి స్కూల్ కు చేరుకొని స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. డీఈవో దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటాని ఎంఈవో హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.