V6 News

మే 6న రైతులతో బీఆర్ఎస్ సభ : కేటీఆర్

మే 6న రైతులతో బీఆర్ఎస్ సభ : కేటీఆర్
  •     రైతు డిక్లరేషన్ అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం: కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: రైతులను కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగానూ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్​ను ప్రకటించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లవుతున్నా ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. స్వయంగా లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వరంగల్ వచ్చి డిక్లరేషన్​ను ప్రకటించి మోసం చేశారన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్​ను ప్రకటించిన మే 6న.. కాంగ్రెస్​ మోసాన్ని తెలియజేసేలా రైతులతో సభ నిర్వహిస్తామన్నారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ వరంగల్ నేతలు, గ్రేటర్ హైదరాబాద్ నేతలతో వేర్వేరుగా ఆయన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో ఎరువుల కొరత, విత్తనాల కొరత, ధాన్యం కొనుగోళ్లలో తీవ్రమైన సంక్షోభం వంటి సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. కరెంట్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పోరాటాలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు వంటి సంస్థాగత అంశాలపైనా నేతలకు కీలక సూచనలు చేశారు. త్వరలో జరగనున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. దీంతోపాటు ఈసీ నిర్వహించనున్న సర్ ప్రక్రియను కీలకంగా పరిగణించాలని నేతలకు సూచించారు.