
- యథాలాపంగా అన్న మాటలకు ఇప్పటికే క్షమాపణ చెప్పా
- సీఎం రేవంత్ బీజేపీలో చేరుతున్నరని కామెంట్
హైదరాబాద్, వెలుగు: మహిళా కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 24న కమిషన్ ఎదుట హాజరవుతానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బస్సుల్లో బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేసుకోండంటూ తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తానని చెప్పారు. అలాగే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలు, ఆడపిల్లలపై జరిగిన అత్యాచారాలు, హత్యలు, దాడుల వివరాలను, మహిళలపై సీఎం రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యల వివరాలను కూడా కమిషన్‌కు అందజేస్తానన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి తన టీంతో కలిసి త్వరలోనే బీజేపీలో చేరనున్నారని కేటీఆర్ అన్నారు. పార్టీలో చేరతానని ఆయన ప్రధాని మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు హామీ ఇచ్చారన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ జర్నలిస్టులతో ఆయన చిట్ చాట్ చేశారు. ప్రధాని మోదీకి రేవంత్ భయపడుతున్నాడని, ఆ భయానికి కారణమేంటో ఇటీవలే అతని స్నేహితులకు చెప్పుకున్నాడని ఆరోపించారు.
కాగా, కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నేతలతో కేటీఆర్ శనివారం తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులంతా నిత్యం ప్రజల్లోనే ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ 8 నెలల పాలనతో ప్రజలంతా విసుగుచెంది ఉన్నారని తెలిపారు.