
- రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి అన్ని లెక్కలు సెటిల్ చేస్త
- నేను కేసీఆర్ అంత మంచోడ్ని కాదు
- దక్షిణాదిపై డీలిమిటేషన్ కత్తి
- రేషన్ బియ్యం పంచి.. రాముడి తలంబ్రాలనే కథ చెప్పిన్రు
- ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కామెంట్స్
కరీంనగర్, వెలుగు: సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసులు ఇష్టమొచ్చినట్టు కేసులు పెడుతున్నారని, తాను కేసీఆర్ అంత మంచోడ్ని కాదని, వారి పేర్లు రాసి పెడితే అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కని సంగతి చెప్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ‘రిటైరయిపోతం.. మాకేమైతదని కొందరు అనుకుంటున్నరు కావొచ్చు. కానీ రిటైర్అయి వేరే దేశానికి పోయినా రప్పించి అన్ని లెక్కలు సెటిల్ చేస్త. ఇది వరకు ఉన్న కథ వేరు.. ఇప్పుడున్న కథ వేరు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అంతకుముందు మంకమ్మతోట నుంచి బస్టాండ్, కమాన్ మీదుగా నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఒకప్పుడు కుటుంబ నియంత్రణ పాటించిన పాపానికి దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగబోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
జనాభా తగ్గితే అభివృద్ధి, మంచి జరుగుతుందని దేశభక్తులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలతోపాటు ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రజలు ఆలోచిస్తే.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జనాభాకు తగ్గట్టుగానే పార్లమెంట్ సీట్లు అంటూ దక్షిణాది మీద డీలిమిటేషన్ కత్తి పెడుతున్నదని మండిపడ్డారు.
మనకు కూడా సెంటిమెంట్ పూశారు
‘ఊళ్లలో రేషన్ బియ్యం పంచి.. తలంబ్రాలనే కథ చెప్పిండ్లు. వీళ్లను మోసగాళ్లను గుర్తించి అయోధ్యలోనే ఓడగొట్టిండ్లు. కానీ వీళ్లు తలంబ్రాలు తెచ్చి మనకు కూడా సెంటిమెంట్ పూసిండ్లు. గత పదేండ్లలో తెలంగాణకు ఏం చేసినవని బీజేపీని అడిగితే.. మేమే.. బ్బేబ్బే. బండి సంజయ్ కు ఒకటే తెలుసు.. మసీదు ను కూలగొడుతాం.. శివం ఎల్తే మాకు.. శవం ఎల్తే మీకు అంటడు. లేదంటే ఈ రోజు ఏం వారం.. రేపు ఏం వారం అంటడు.
ఒక బడి తెచ్చిందీ లేదు. ఓ గుడి కట్టిందీ లేదు. గుడి కట్టినా, బడి కట్టినా, మెడికల్ కాలేజీ కట్టినా, చివరి గ్రామాలకు నీళ్లిచ్చినా బీఆర్ఎస్సే’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ రైతును మందలించినా గుడ్లల్లకెళ్లి నీళ్లొస్తున్నాయని, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనని బాధపడుతున్నరని కేటీఆర్ అన్నారు.
ప్రజలకు ఆశపెట్టి గెలిచారు
బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అసూయ, ద్వేషం, ఆశ అనే మూడింటిని ప్రయోగించారని కేటీఆర్ విమర్శించారు. ‘జెడ్పీటీసో, ఎంపీటీసో, సర్పంచో కారో, స్కూటర్ కొనుక్కుంటే.. చూసినవా.. ఈయనే ఇంత సంపాయించిండంటే.. ఎమ్మెల్యే ఎంత సంపాయించిండో.. మంత్రులు ఎంత సంపాయించిండో, కేసీఆర్ ఎంత సంపాయించిండో అని చెవులు కొరుక్కునుడు. వేరేటోళ్లు ఇల్లు కట్టుకుంట లేరా.. ఊళ్లలో సంపాదన పెరగలేదా..’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
స్థానిక నాయకత్వం మీద అసూయ పెంచి, కేసీఆర్, కేసీఆర్ కుటుంబం మీద ద్వేషం నింపారని, ఈ రోజు దొర పోయిండు.. దొంగ వచ్చి కూసున్నడని మండిపడ్డారు. ఏప్రిల్ 27న హనుమకొండలో జరిగే సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
వరంగల్ డిక్లరేషన్‌కు తూట్లు
హైదరాబాద్, వెలుగు: చట్ట సభల సాక్షిగా కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ కు తూట్లు పొడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చేయని శపథం, ఆడని అబద్ధం లేదని, 420 అబద్ధపు హామీలు ఇచ్చి తెలంగాణ రైతుల గుండెల్లో గునపం దించిందని ఆరోపించారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఒకలా... వచ్చాక మరోలా మాట్లాడుతున్నదని ఆదివారం ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించారు. ‘‘అధికారం కోసం అందరికి రుణమాఫీ.. అధికారం దక్కాక కొందరికే రుణమాఫీ.
నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు- పెట్టెలో ఓట్లు పడ్డాయ్.. జేబులో నోట్లు పడ్డాయ్.. ఢిల్లీకి మూటలు ముట్టాయ్.. ఇక ఇచ్చిన వాగ్దానాలు ఉంటే ఎంత గంగలో కలిస్తే ఎంత అన్నట్లుంది కాంగ్రెస్ యవ్వారం. రూ.2 లక్షల వరకు కుటుంబంతో సంబంధం లేకుండా రుణమాఫీ అని ప్రకటించారు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ అని చెబుతున్నారు. నాడు రూ. 2 లక్షలు దాటినా రుణమాఫీ అన్నారు. ఇప్పుడేమో రూ. 2 లక్షల పైబడితే మాఫీ లేదంటున్నారు. నాడు ఓట్ల కోసం హామీలు .. నేడు ఎగవేత కోసం కొర్రీలు” అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.