మేక్ ఇన్ ఇండియా అని లీక్ ఇన్ ఇండియా చేసిన్రు.. కేంద్ర మంత్రి ధర్మేంద్రను ఎందుకు కాపాడుతున్నరు?: కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మేక్ ఇన్ ఇండియా అని లీక్ ఇన్ ఇండియా చేసిన్రు.. కేంద్ర మంత్రి ధర్మేంద్రను ఎందుకు కాపాడుతున్నరు?: కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ప్రధాని మోదీ కొరివితో తల గోక్కుంటున్నరు 
  • నేపాల్, శ్రీలంక తరహాలో ఇండియాలో కూడా ఉద్యమం వస్తుందని అప్పుడే చెప్పా 
  • తాను పేపర్ లీకేజీలో ఉంటే ఇందిరా పార్కు దగ్గర ఉరెయ్యాలని సవాల్​
  • నీట్ స్టూడెంట్లకు మద్దతుగా ఇందిరాపార్కులో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​వీ ధర్నా

హైదరాబాద్ సిటీ, వెలుగు: కేంద్రంలోని బీజేపీ సర్కార్ మేకిన్ ఇండియా అని లీక్ ఇన్ ఇండియా చేసి స్టూడెంట్ల జీవితాలతో చెలగాటమాడుతోందని బీఆర్‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జంతర్ మంతర్‌‌‌‌లో ధర్నా చేస్తున్న నీట్ స్టూడెంట్స్‌‌పై జరిగిన లాఠీచార్జ్‌‌కి నిరసనగా శుక్రవారం హైదరాబాద్‌‌లోని ఇందిరా పార్క్‌‌లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి నీట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కాక్రోచ్‌‌ జనతా పార్టీ మద్దతుదారులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఢిల్లీలో నిరసన తెలిపిన స్టూడెంట్లపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకుని, ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో పిల్లల మీద లాఠీచార్జ్‌‌ చేస్తే కళ్లలో నీళ్లు తిరిగాయన్నారు. స్టూడెంట్స్ ప్రధాని మోదీ కుర్చీ అడిగారా.. లేక కేంద్ర విద్యాశాఖ మంత్రి సీటు ఇవ్వమని అడిగారా అని ప్రశ్నించారు. సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ స్టూడెంట్స్‌‌కు న్యాయం చేయాలని నిరసన దీక్షకు కూర్చుంటే.. ఏ ఒక్క ప్రధాన చానల్‌‌ కూడా చూపించడం లేదని, అయితే, స్టూడెంట్స్ సోషల్ మీడియాతో దేశం మొత్తం కదిలించారన్నారు. 

నీట్ ఎగ్జామ్‌‌లో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న వారిని అర్బన్ నక్సలైట్లు, టెర్రరిస్టులు, ఖలిస్తానీలు, పాకిస్తాన్ మద్దతుదారులు అంటూ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ జనరేషన్‌‌లో పుట్టిన వారు చావుకు భయపడే వారు కాదని,  ప్రధాని మోదీ కొరివితో తల గొక్కుంటున్నారు విమర్శించారు. 

మోదీ అంటే సీఎంకు భయం.. 

మేం కొట్లాడుతుంటే కాంగ్రెస్ వాళ్లు అడ్డుపడుతున్నారని, మోదీని అంటే కేడీగాళ్లకు ఏమొచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీలో ప్రధాని ఇంటి ముందు రాహుల్ గాంధీ ధర్నా చేస్తుంటే నల్లమల్ల పిల్లి ( సీఎం రేవంత్ రెడ్డి) పోయి కొడంగల్‌‌లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. మోదీ అంటే సీఎం రేవంత్ రెడ్డికి భయమన్నారు. పాత కేసులు పెట్టి జైల్లో వేస్తారని సీఎం భయపడుతున్నారన్నారు. సీఎం కన్నా పీసీసీ చీఫ్‌‌ మహేశ్ గౌడ్ నయమని, కనీసం లోక్‌‌భవన్ ఎదుట నిరసనకు దిగారన్నారు. 

తాము జంతర్ మంతర్‌‌‌‌కు వచ్చి మద్దతు తెలిపితే జెండాలు, ఏజెండాలు అంటూ పక్కదారి పట్టిస్తారని, అందుకే అక్కడికి రాలేదన్నారు. ఏదో పేపర్ లీక్‌‌కు కేటీఆర్‌‌‌‌కు సంబంధం ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసు పంపించానన్నారు. తాను చేసింది తప్పయితే ఇదే ఇందిరా పార్క్ వద్ద స్టూడెంట్స్ ఎదుట తనను ఉరితీయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. 

ఏ దేశం కోసం.. ఎవరి ధర్మం కోసం.. 

‘‘మాట్లాడితే బీజేపీ వాళ్లు దేశం కోసం ధర్మం కోసం అంటారు. ఏ దేశం కోసం, ఎవరి ధర్మం కోసం.. ఇక్కడ కొట్లాడుతున్న పిల్లలు హిందువులు కాదా.. వీరి కోసం మీరు మాట్లాడారా’’అని కేటీఆర్‌‌‌‌ ప్రశ్నించారు. అవసరమైతే కేసీఆర్ కూడా స్టూడెంట్స్ భవిష్యత్తు కోసం వచ్చి మీటింగ్ పెడతారన్నారు. నేపాల్, శ్రీలంక తరహాలో ఇండియాలో కూడా ఉద్యమం జరుగుతుందని గతంలో తాను చెబితే అందరూ నవ్వారని.. ఇప్పుడు అదే జరుగుతుందన్నారు. మీకు వ్యతిరేకంగా గళమెత్తితే అర్బన్ నక్సలైట్లు అని అంటారా అని నిలదీశారు.