కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్​డౌన్ మొదలైంది: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్​డౌన్ మొదలైంది: కేటీఆర్
  • వంద రోజుల్లో హామీలు అమలు చేయకపోతే ప్రజలే బొంద పెడ్తరు: కేటీఆర్ 
  • కాళేశ్వరంపై ఏ విచారణకైనా సిద్ధం
  • తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది కేసీఆర్ మాత్రమే
  • రేవంత్, సంజయ్ ఒక్కటయ్యారని విమర్శ   

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్​డౌన్ మొదలైందని, వంద రోజుల్లో హామీలు అమలు చేయకపోతే ఆ పార్టీని ప్రజలే బొందపెడతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్ లో ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధి నేతలతో పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. కాళేశ్వరంపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తప్పు చేయలేదు కాబట్టే జ్యుడీషియల్ ఎంక్వైరీ కోరామని చెప్పారు. 

‘‘దేశంలోని కొన్ని రాష్ట్రాల పేరు చెప్తే, అక్కడి ప్రముఖ నేతల పేర్లు ఎలా చెప్తారో.. తెలంగాణ అనగానే గుర్తుకువచ్చేది కేసీఆర్ మాత్రమే. తెలంగాణ గళం, బలం కేసీఆరే. రేపు కేసీఆర్ దండు ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేస్తున్నాం. ఢిల్లీలో తెలంగాణ గళం వినిపించాలంటే బీఆర్ఎస్ కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఏ రోజైనా పార్లమెంట్ లో తెలంగాణ వాణి వినిపించారా? అని ప్రశ్నించారు.  

హామీలు అమలు చెయ్యలేకనే కొత్త డ్రామాలు.. 

సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ నేత బండి సంజయ్ ఒక్కటయ్యారని కేటీఆర్ విమర్శించారు. ‘‘రేవంత్ రెడ్డి సర్కార్ ను బండి సంజయ్ పొగుడుతున్నారు. సంజయ్ ను రేవంత్ పొగుడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే మళ్లీ ఇద్దరూ ఒక్కటైనట్టు కనిపిస్తున్నది. గత పార్లమెంట్, అనేక ఉప ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పని చేసినట్టే.. ఇప్పుడు కూడా చేస్తారేమో అనిపిస్తున్నది” అని అన్నారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలు అమలు చెయ్యలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామాలకు తెర తీస్తున్నదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఖజానా నుంచి కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ ను తాము దాచి పెట్టామంటూ రేవంత్ రెడ్డి చిల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతులకు ఇంతవరకు రైతుబంధు ఎందుకు వెయ్యలేదని ప్రశ్నించారు. తాము చేసిన అభివృద్ధికి తాగే నీళ్లు, పండే పంటనే సాక్ష్యమని పేర్కొన్నారు. ‘‘లోక్ సభ ఎన్నికలతో పాటు జరగబోయే అన్ని ఎన్నికలపైనా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తాం. జిల్లా, మండల పరిషత్ , మున్సిపల్, పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పని చేస్తాం. మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప.. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు. ఆ పార్టీ వికృత చేష్టలను గట్టిగా అడ్డుకున్నది మా పార్టీ మాత్రమే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పెద్ద నాయకులను ఓడించింది బీఆర్ఎస్ తప్ప కాంగ్రెస్ కాదనే విషయం గుర్తించాలి” అని అన్నారు. ఈ నెల 21వ తేదీ వరకు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నేతల సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.  

తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయాం.. 

కేసీఆర్ త్వరలో కోలుకుంటారని, ప్రతి రోజు పార్టీ కార్యక్రమాలపై ఆయన తమకు దిశానిర్దేశం చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ కోలుకున్న తర్వాత లోక్ సభ అభ్యర్థులను ప్రకటిస్తారని చెప్పారు. ‘‘కేసీఆర్ ఓడిపోతారని అనుకోలేదని గ్రామాల్లో చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యేలను మాత్రం వద్దనుకున్నాం.. కేసీఆర్​ను కాదని చెప్తున్నారు. మా ప్రభుత్వంలో చేపట్టిన కొన్ని కార్యక్రమాల్లో సవరణలు చేస్తే బాగుండేదనే సూచనలు వచ్చాయి. ప్రభుత్వంపై జరిగిన దుష్ప్రచారం తిప్పికొట్టలేకపోయామనే ఫీడ్ బ్యాక్ లీడర్ల నుంచి వచ్చింది. ఇంటికో ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయాం” అని అన్నారు. ఎన్నికల హామీలు ఎగ్గొట్టేందుకే శ్వేతపత్రాలు అంటున్నారని, సీఎం చేస్తున్న ప్రకటనలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కేటీఆర్​ అన్నారు.