- సిరిసిల్ల నేతన్నల గురించి మాట్లాడటమా?: కాంగ్రెస్ నేత ఈరవత్రి అనిల్
హైదరాబాద్, వెలుగు: హ్యాండ్లూమ్, పవర్‌లూమ్‌కు తేడా తెలియని కేటీఆర్ గతంలో చేనేత శాఖ మంత్రిగా పనిచేయడం దురదృష్టకరమని కాంగ్రెస్ నేత ఈరవత్రి అనిల్ విమర్శించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నేతన్నల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ లేఖ రాయడం ఆయన అవగాహన లేమికి నిదర్శనమని మండిపడ్డారు.
బీఆర్‌ఎస్ పాలనలోనే నేతన్నల పొదుపు సొమ్ము నిలిచిపోయిందని, 2021 నుంచి బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.230 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలోనే బతుకమ్మ చీరలకు సంబంధించిన రూ.400 కోట్ల బకాయిలు చెల్లించలేదని, తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.290 కోట్లు చెల్లించిందని చెప్పారు. బీఆర్‌ఎస్ పాలనలో నేతన్నల బతుకులు దయనీయంగా మారాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే వారికి ఆర్థిక చేయూత లభిస్తోందని అనిల్ పేర్కొన్నారు.
