కేటీఆర్.. ఆంధ్రాకు వెళ్లిపో..ఉమ్మడి ఏపీ పాలనపై ఇప్పుడెందుకంటూ భట్టి ఫైర్

కేటీఆర్.. ఆంధ్రాకు వెళ్లిపో..ఉమ్మడి ఏపీ పాలనపై ఇప్పుడెందుకంటూ భట్టి ఫైర్
  • గత కాంగ్రెస్ పాలనను గుర్తుచేస్తూ కేటీఆర్ కామెంట్లు
  • పదేపదే విమర్శలు చేయడంపై డిప్యూటీ సీఎం ఆగ్రహం
  • అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీలో శనివారం వాడీవేడిగా చర్చ జరిగింది. ఉమ్మడి ఏపీ నాటి కాంగ్రెస్ పాలనను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పదేపదే విమర్శలు చేయగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయనకు కౌంటర్లు ఇచ్చారు. అధికారపక్షం గావుకేకలు, పెడబొబ్బలతో, మందబలంతో శాసిస్తామంటే చరిత్ర మారదని కేటీఆర్ అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో నీళ్లు కూడా దొరకలేదని పేర్కొంటూ.. అప్పట్లో అసెంబ్లీలో రేవంత్‌‌ మాట్లాడిన విషయాన్ని ప్రస్తావించారు. ‘‘తన తండ్రి చనిపోయినప్పుడు దహన సంస్కారాల తర్వాత స్నానాలకు నీళ్లు కూడా దొరకలేదని అప్పుట్లో అసెంబ్లీలో రేవంత్‌‌ చెప్పారు’’ అని గుర్తు చేశారు. దీంతో కలగజేసుకున్న భట్టి.. ‘‘ఇది ఏపీ శాసనసభ కాదు.. తెలంగాణ శాసన సభ. 2014లో రాష్ట్రం వచ్చినప్పటి నుంచి జరిగిన అంశాలపైనే మాట్లాడాలి. ఇప్పటికీ వాళ్లతోనే (ఆంధ్రా నాయకులు) పోటీ పడతానంటే.. నువ్వు కూడా అటే వెళ్లు. ఇక్కడెందుకు?” అంటూ కేటీఆర్‌‌‌‌కు కౌంటర్ ఇచ్చారు. అయితే ఇందిరమ్మ పాలన అని కాంగ్రెసోళ్లు అంటున్నారు కాబట్టే, ఆమె పాలనలో జరిగిన దుర్మార్గాలను తాను గుర్తు చేస్తున్నానని కేటీఆర్ అన్నారు. ‘‘పోతిరెడ్డిపాడుకు పొక్క తవ్వి ఆంధ్రాకు నీళ్లు తరలించుకుపోతుంటే, ఇక్కడి కాంగ్రెస్ నాయకులు హారతులు పట్టారు. గతంలో మనల్ని పీడించినవాళ్లు పోయినప్పటికీ, వాళ్లను (వైఎస్‌‌ఆర్‌‌‌‌, కిరణ్‌‌కుమార్‌‌‌‌రెడ్డి) తలుచుకునే వాళ్లు ఇంకా ఇక్కడే ఉన్నారు. బానిసకు ఒక బానిసకు ఒక బానిస అంటే ఇదే” అని విమర్శించారు.

కాంగ్రెస్ హయాంలో అన్నీ కష్టాలే :  కేటీఆర్   

గవర్నర్ ప్రసంగమంతా అసత్యాలు, అభూత కల్పనలని.. ఇలాంటి ప్రసంగం విన్నందుకు తాను సిగ్గు పడుతున్నానని కేటీఆర్ అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పడావుపడ్డ భూములు, ఆకలి కేకలు, ఆత్మహత్యలే ఉండేవని విమర్శించారు. దీంతో కలగజేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌.. అప్పుడు అలా ఉండేది కాబట్టే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని, గత పదేండ్లలో ఏం జరిగిందో దాని గురించే మాట్లాడాలని కేటీఆర్‌‌‌‌కు సూచించారు. అయితే కాంగ్రెస్ హయాంలో జరిగిన మంచిని ప్రభుత్వం చెబుతోంది కాబట్టి, ఆ పార్టీ హయాంలో జరిగిన దుర్మార్గాలను తాము చెబుతామని కేటీఆర్ అన్నారు. ‘‘కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోతలు, కటిక చీకట్లు, తాగు, సాగు నీటి కష్టాలు తప్ప ఇంకేం లేదు. దేవరకొండలో అమ్మాయిల అమ్మకాలు, పాలమూరు నుంచి వలసలు, కొడంగల్ నుంచి రోజూ బొంబాయికి రెండు బస్సుల్లో వలసలు, 50 ఎకరాలు ఉన్న రైతు కూడా గుంపు మేస్త్రీగా పని చేయాల్సిన దుస్థితి ఉండేది” అని చెప్పారు.

రేవంత్​కు సంస్కారం లేదంటూ ఫైర్..

అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలంపై కేటీఆర్‌‌‌‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యకు, తమ ఎమ్మెల్యేల సంఖ్యకు పెద్ద తేడా ఏమీ లేదన్నారు. దీంతో సీఎం రేవంత్‌‌ కలగజేసుకుని.. బీఆర్ఎస్ కు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం కాదు అంటూ కౌంటర్ వేశారు. ఈ క్రమంలో అచ్చోసిన ఆంబోతులు అనే పదాన్ని రేవంత్ వాడారు. దీంతో సీఎం అలా మాట్లాడడం సంస్కారం కాదని కేటీఆర్ అన్నారు. ‘‘కేసీఆర్‌‌‌‌ను ఏకవచనంతో రేవంత్ సంబోధించారు. కానీ మాకు సంస్కారం ఉన్నందున ఆయనను మేం అలా ఏకవచనంతో సంబోధించం. ఎన్‌‌ఆర్‌‌‌‌ఐలకు రేవంత్ టికెట్లు అమ్ముకున్నారు. విదేశీ పౌరురాలైన సోనియా గాంధీని కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేసుకున్నారు. కనీసం సీఎం అయిన తర్వాతైనా రేవంత్ భాష మార్చుకుంటారని అనుకున్నాం. కానీ కొంతమంది నుంచి సంస్కారం ఎక్స్‌‌పెక్ట్ చేయలేం” అని దుయ్యబట్టారు. అభ్యుదయం అంటే, ఐటీఐఆర్ అంటే తెలియనివాళ్లు ఆయా అంశాల గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందన్నారు. తమ రక్తాన్ని రంగరించి, మెదళ్లను కరిగించి తెలంగాణలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశామన్నారు. ‘‘ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ నెరవేర్చాలి. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. ఒక్క చెన్నూరు నియోజకవర్గంలోనే 40 వేల ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. ఈ హామీలన్నీ నెరవేర్చాలి” అని అన్నారు.

విధ్వంసం చేసినోళ్లే మాట్లాడడం విడ్డూరం :  భట్టి

ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు చేయాలే తప్ప, దశాబ్దాల కిందటి అంశాలను వక్రీకరించి ప్రభుత్వంపై విమ ర్శలు చేయొద్దని కేటీఆర్​కు భట్టి సూచించారు. ఈ పదేండ్లలో బీఆర్‌‌‌‌ఎస్ ఏం చేసిందో చెప్పుకోవాలని, తమ ప్రభుత్వం ఏం చేయాలో సూచనలు చేయాలని కోరారు. కాంగ్రెస్ హయాంలో నీళ్లు లేవని కేటీఆర్‌‌‌‌ అంటున్నా రని, తాము తీసుకొచ్చిన ఆర్‌‌‌‌డబ్ల్యూఎస్‌‌ పథకాన్ని నాశనం చేసి ప్రజలకు నీళ్లు అందకుండా చేసిందే బీఆర్‌‌‌‌ఎస్ అని మండిపడ్డారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. తమ పదేండ్ల విధ్వంసం గురించి కాంగ్రెస్ మాట్లాడితే, గతంలో కాంగ్రెస్ చేసిన విధ్వంసం గురించి తాము మాట్లాడాల్సి వస్తుందని అన్నారు. ‘‘తాగు, సాగు నీరు, కరెంట్ ఇవ్వలేని అసమర్థులు కాంగ్రెసోళ్లు. అదే విషయం చెబితే ఎందుకు భయపడుతున్నారు. ‘కొత్త ప్రభుత్వానికి 3 నెలల సమయం ఇద్దాం.. అట్టర్ ఫ్లాప్ అవుతుంది’ అని మా అధ్యక్షుడు (కేసీఆర్‌‌‌‌) చెప్పారు. కానీ పదేండ్ల విధ్వం సం అంటూ మీరు మాట్లాడడంతోనే మేము మాట్లాడాల్సి వస్తోంది. తెలంగాణ కోసం మేము కొట్లాడినప్పుడు, అప్పుడు ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ నేతలు మౌనంగా ఉన్నారు. మేము రాజీనామాలు చేసి కొట్లాడితే, వాళ్లు పదవుల కోసం పాకులాడారు” అని విమర్శించారు. ఈ క్రమంలో భట్టి కలగజేసుకుని.. తెలంగాణ కోసం తమ మంత్రులు కూడా రాజీనామా చేశారని గుర్తుచేశారు. తాము కొట్లాడి, ఒప్పించాం కాబట్టే అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. ‘‘కొత్త రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్‌‌తో ఇస్తే, అప్పుల కుప్పగా మార్చింది బీఆర్‌‌‌‌ఎస్సే. అందుకే ప్రజలు ఆ పార్టీని ఓడించి కాంగ్రెస్‌‌కు అధికారం ఇచ్చారు. పదేండ్లు విధ్వంసం చేసి,  50 ఏండ్ల కిందటి ముచ్చట మాట్లాడడం విడ్డూరంగా ఉంది” అని కేటీఆర్ కు భట్టి కౌంటర్ ఇచ్చారు.