కేటీఆర్​ బినామీల కోసమే ఐఆర్​బీ సంస్థను ముందటికి తెచ్చిన్రు

కేటీఆర్​ బినామీల కోసమే ఐఆర్​బీ సంస్థను ముందటికి తెచ్చిన్రు
  • ప్రజలను మున్సిపల్​ స్పెషల్​ సీఎస్​ అరవింద్​ తప్పుదోవ పట్టిస్తున్నరు
  • అధికారంలోకి వస్తే ఓఆర్​ఆర్​ టోల్​ చార్జీలు ఎత్తేస్తామని ప్రకటన

హైదరాబాద్, వెలుగు: ఔటర్​ రింగ్​ రోడ్డు టోల్​ టెండర్​ విషయంలో మంత్రి కేటీఆర్​ ఎందుకు మౌనంగా ఉన్నారని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత శాఖ మంత్రిగా ఆయనకు లేదా అని నిలదీశారు. టెండర్ల విషయంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని, భారీ కుంభకోణానికి కేటీఆరే కారణమని ఆరోపించారు. ‘‘ఇరుక్కుపోతాననే భయంతోనే  కేటీఆర్​ ముఖం చాటేసిండు. తెలంగాణ కేబినెట్​కేమీ అతీత శక్తులు లేవు.. కల్వకుంట్ల రాజ్యాంగం ఇక్కడ చెల్లదు” అని హెచ్చరించారు. గురువారం రేవంత్​రెడ్డి తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. ‘‘విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కొంటామన్న సీఎం కేసీఆర్​.. తెలంగాణ ప్రజల ఆస్తి అయిన ఓఆర్​ఆర్​ను ఎందుకు ప్రైవేటుకు కట్టబెట్టారో చెప్పాలి? ఓఆర్​ఆర్​ను అమ్మేసుకునే హక్కు కేసీఆర్​కు ఎవరిచ్చారు?” అని మండిపడ్డారు. 

ఓఆర్​ఆర్​ టెండర్లలో బేస్​ ప్రైస్​ వివరాలను ఎందుకు చెప్పడం లేదని మున్సిపల్​ శాఖ స్పెషల్​ సీఎస్​ అరవింద్​ కుమార్​ను రేవంత్​ ప్రశ్నించారు. అందులో ఏమైనా దేశ భద్రతకు సంబంధించిన రహస్యంగానీ.. కేసీఆర్​ ప్రాణంగానీ ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రజలను అరవింద్​ కుమార్​ తప్పుదోవ పట్టిస్తున్నారని,  బేస్​ ప్రైస్​ పెట్టకుండా ఎవరైనా టెండర్లను పిలుస్తారా? అని నిలదీశారు. ‘‘మాజర్​ సంస్థ నివేదిక ప్రకారమే టెండర్లు ఇచ్చామంటూ అరవింద్​ కుమార్​ సమర్థించుకుంటున్నరు. కానీ, ఆ సంస్థపై అమెరికాలో క్రిమినల్​ కేసులు నమోదయ్యాయి.  క్రిసిల్​ అనే సంస్థ ఇచ్చిన శాస్త్రీయ నివేదికను కాదని.. మాజర్​ నివేదికను ఎట్ల పరిగణనలోకి తీసుకున్నరు?” అని ఆయన ప్రశ్నించారు. వాస్తవానికి ఓఆర్​ఆర్​ హైదరాబాద్​ గ్రోత్​ కారిడార్​ లిమిటెడ్​ పరిధిలో ఉండేదని, కానీ, అగ్గువకు ప్రైవేటుకిచ్చేందుకే హెచ్​ఎండీఏ పరిధిలోకి తీసుకొచ్చారని  ఆరోపించారు. ఐఆర్​బీకి ఓఆర్​ఆర్​ను కట్టబెట్టేందుకే హెచ్​జీసీఎల్​ ఎండీ సంతోష్​ను మార్చేసి.. రిటైరైన బీఎల్​ఎన్​ రెడ్డిని ఆ ప్లేస్​లో నియమించారని,  ఐఆర్​బీ కంపెనీని ముందు పెట్టి.. ఆ తర్వాత కేటీఆర్​ బినామీ కంపెనీలు ఇందులో చొరబడేందుకు కుట్ర జరుగుతున్నదని  దుయ్యబట్టారు. టెండర్లను ఓపెన్​ చేయగానే వివరాలను వెల్లడిస్తారని, కానీ, ఈ విషయంలో మాత్రం 16 రోజులు ఆలస్యంగా వివరాలు చెప్పారని అన్నారు. ఏప్రిల్​ 11న టెండర్లను ఓపెన్​ చేస్తే.. 27న ప్రకటించారని, ఇన్ని రోజులు ఎందుకు ఆగాల్సి వచ్చిందని రేవంత్​ ప్రశ్నించారు. దాని వెనుక ఉన్న గూడుపుఠానీ ఏమిటో బయటపెట్టాలని డిమాండ్​ చేశారు. 

ఎన్​హెచ్​ఏఐ రూల్స్​ ప్రకారం టెండర్లు ఇవ్వలేదు

ఓఆర్​ఆర్​ టెండర్లపై నేషనల్​ హైవే అథారిటీ ఆఫ్​ ఇండియా (ఎన్​హెచ్​ఏఐ) అభ్యంతరం చెప్పిందని రేవంత్​ అన్నారు. ఎన్​హెచ్​ఏఐ పేర్కొన్న రూల్స్​ ప్రకారం టెండర్లను ఇవ్వలేదని పేర్కొన్నారు. టోల్​గేట్​పై రోజుకు రూ.2 కోట్ల ఆదాయం వస్తుందని, ఈ లెక్కన ఏడాదికి రూ.730 కోట్లు, 30 ఏండ్లకు రూ. 22 వేల కోట్ల ఆమ్దానీ వస్తుందని అన్నారు. అలాంటి ఔటర్​ రింగ్​ రోడ్డుకు రూ.16 వేల కోట్ల బ్యాంకు రుణం వస్తుందని చెప్పారు. కానీ, అతి తక్కువ ధరకే ప్రభుత్వం ప్రైవేటుకు కట్టబెట్టిందని రేవంత్​ మండిపడ్డారు. 

ఐఆర్​బీ సంస్థ బిడ్​లో రూ.7,272 కోట్లే కోట్​ చేసిందని, కానీ, వివరాలు ప్రకటించే నాటికి అది రూ.7,380 కోట్లుగా ఎలా మారిందని ప్రశ్నించారు. టెండర్​ దక్కించుకున్న సంస్థనే గ్రీనరీ బాధ్యతను కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని, కానీ ఆ సంస్థకు దాని నుంచి మినహాయింపునిచ్చారని తెలిపారు. గ్రీనరీ నిర్వహణ ఖర్చు ఏడాదికి రూ.40 కోట్లు అయితే.. 30 ఏండ్లకు రూ.1,200 కోట్లు అవుతుందని వివరించారు. ఈ లెక్కన ఐఆర్​బీకి 30 ఏండ్లపాటు ఓఆర్​ఆర్​ టెండర్​ రూ.6,180 కోట్లకే దక్కినట్టని ఆయన తెలిపారు.

కాగ్​కు ఫిర్యాదు చేస్తం

ఓఆర్​ఆర్​ అంశంపై ఆర్టీఐ ద్వారా వివరాలను అడిగినా ఇవ్వడం లేదని రేవంత్​ మండిపడ్డారు. సీబీఐ, ఈడీకి కూడా సమాధానం ఇవ్వరా అని ప్రశ్నించారు. టెండర్ల విషయంపై స్టేట్​ విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​కు, సెంట్రల్​ విజిలెన్స్​ కమిషన్​కు, డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కాగ్​కు కూడా అన్ని వివరాలతో ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. కాగా, ఈనెల 8న సరూర్​నగర్​లో నిర్వహించే సభకు ప్రియాంకా గాంధీ వస్తున్నారని, అందులో యూత్​ డిక్లరేషన్​ను ప్రకటిస్తామని  రేవంత్​ తెలిపారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే ఓఆర్​ఆర్​పై టోల్​ చార్జీలను ఎత్తేస్తామని ఆయన  మీడియా చిట్​చాట్​లో పేర్కొన్నారు. ఓఆర్​ఆర్​ మీదున్న రుణాలు ఇప్పటికే తీరిపోయాయని, కాంగ్రెస్​ ప్రభుత్వమే పూర్తిగా దాని నిర్వహణను చూసుకుంటుందని చెప్పారు. ఓఆర్​ఆర్​పై ప్రతి ఒక్కరికీ ఫ్రీ ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు.

ఐఆర్​బీపై క్రిమినల్​ కేసులన్నయ్​

ఓఆర్​ఆర్​ టెండర్​ను దక్కించుకున్న ఐఆర్​బీ సంస్థపై క్రిమినల్​ కేసులున్నాయని రేవంత్​ ఆరోపించారు. కంపెనీపై సీబీఐ కేసు ఉన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 2017లో కొద్దిరోజుల పాటు ఈ సంస్థే ఓఆర్​ఆర్​ టోల్​ నిర్వహణ బాధ్యత చేపట్టిందని గుర్తు చేశారు. రోజుకు రూ.87 లక్షలు చెల్లించాల్సి ఉన్నా.. కేవలం రూ.60 లక్షలే చెల్లిస్తుండడంతో రూ.25 కోట్ల డిపాజిట్​ను సీజ్​ చేసి కంపెనీని బ్లాక్​లిస్టులో పెట్టిన విషయం నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. అట్లాంటి కంపెనీని మళ్లీ ఇప్పుడు తెరమీదికి ఎట్లా తెచ్చారని నిలదీశారు. ఓఆర్​ఆర్​పై 30 ఏండ్లకుగానూ 48 గంటల్లోనే రూ.15 వేల కోట్ల రుణాన్ని బ్యాంకు నుంచి ఇప్పిస్తానని ఆయన సవాల్​ విసిరారు. ప్రస్తుత టెండర్లను వెంటనే రద్దు చేయాలని, స్విస్​ చాలెంజ్​ విధానంలో బేస్​ ప్రైస్​ రూ.7,388 కోట్లతో టెండర్లు పిలవాలని డిమాండ్​ చేశారు.