బావ బావమరిది రెండు గంటల డిస్కషన్..పార్టీ పగ్గాలపైనే చర్చించినట్టు టాక్.!

బావ బావమరిది రెండు గంటల డిస్కషన్..పార్టీ పగ్గాలపైనే చర్చించినట్టు టాక్.!
  • హరీశ్ ఇంటికి వెళ్లిన కేటీఆర్
  • పార్టీ పగ్గాలపైనే చర్చించినట్టు టాక్

హైదరాబాద్:  బీఆర్ఎస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మాజీ మంత్రి హరీశ్ రావు ఇంటికి వెళ్లారు. ఆయనతో  రెండు గంటల పాటు భేటీ అయ్యారు. ఇటీవలే హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ కు పార్టీ పగ్గాలు ఇస్తే స్వాగతిస్తానని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా చేసేందుకు తాను సిద్ధ:గా ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన 48 గంటల తర్వాత స్వయంగా కేటీఆర్ హరీశ్ ఇంటికి వెళ్లడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ సాయంత్రం మాజీ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికా వెళ్తున్నారు. తన కుమారుడి గ్రాడ్యుయేషన్ సెర్మనీ కోసం ఆమె భర్తతో కలిసి యూఎస్ వెళ్తున్నారు. ఇదే సమయంలో గులాబీ పార్టీలోని కీలక నేతలు భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 

ఆధిపత్య పోరు

బీఆర్ఎస్  పార్టీలో కొంతకాలంగా ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఎల్కతుర్తిలో జరిగిన రజతోత్సవ సభల పర్యవేక్షణ బాధ్యతలను తొలుత హరీశ్ కు అప్పగించారు కేసీఆర్. తర్వాత ఆయనను తప్పించారు. సీన్లోకి కేటీఆర్, కవిత ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో హరీశ్ రావు పార్టీ మారుతారనే  ప్రచారం ఊపందుకుంది. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని మీడియా ముఖంగా క్లారిటీ ఇచ్చారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై లీగల్ చర్యలకు దిగుతానని కూడా హెచ్చరించారు. అదే సందర్భంగా కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని అన్నారు. కేసీఆర్ మాటే శిరోధార్యం అని, ఆయనతో చివరివరకు ఉంటానని తెగేసి చెప్పారు. ఆయన లైన్ లోనే కొనసాగుతానని పార్టీ మార్పు వార్తలను ఖండించారు. 

ALSO READ | కేసీఆర్,హరీశ్కు కాళేశ్వరం కమిషన్ విచారణ తప్పినట్టేనా.?

ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ కవిత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆమె ఇటీవలే చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా చర్చకు వస్తున్నాయి. హరీశ్ రావు ప్రెస్ మీట్ కు ఒక రోజు ముందే అంటే ఈ నెల 12న కవిత మాట్లాడుతూ.. ఆరునెలలు జైల్లో  ఉన్నది చాలదా..? ఇంకా ఎన్ని రోజులు కష్టపెడతారంటూ కామెంట్ చేశారు. కొందరు తనపై పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపడ్తాయంటూ కామెంట్ చేశారు. కవితను కష్టపెడుతున్నది ఎవరు అన్న చర్చ జరుగుతున్న తరుణంలోనే మరుసటి  రోజు హరీశ్  రావు ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని చెప్పడం గమనార్హం. ఇది జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా హరీశ్ రావు ఇంటికి వెళ్లడం, రెండు గంటల పాటు భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది.