సోషల్ మీడియాలో వైరల్‌ అయిన దివ్యాంగ ప్లేయర్‌‌ ఆవేదన వీడియో

సోషల్ మీడియాలో వైరల్‌ అయిన దివ్యాంగ ప్లేయర్‌‌ ఆవేదన వీడియో

పంజాబ్ ప్రభుత్వ తీరుపై దివ్యాంగ చెస్ క్రీడాకారిణి మాలిక హండా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు ఉద్యోగంతో పాటు ఆర్థిక ప్రోత్సాహకం అందజేస్తామన్న హామీని పంజాబ్  ప్రభుత్వం విస్మరించిందని మండిపడింది. బదిర క్రీడాకారుల కోసం ఎలాంటి క్రీడా విధానం లేకపోవడంతో సహాయం చేయలేకపోతున్నట్లు పంజాబ్ క్రీడలమంత్రి పర్గత్ సింగ్ అన్నట్లు మాలిక వాపోయింది. పంజాబ్  ప్రభుత్వాన్ని నమ్ముకొని ఐదేళ్ల సమయం వృథా చేసుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. 

పంజాబ్‌కు చెందిన మాలిక.. అంతర్జాతీయ బదిరుల చెస్ ఛాంపియన్ షిప్ లో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ప్రపంచ, ఆసియా ఛాంపియన్ షిప్ లలో ఆరు పతకాలు సాధించింది. జాతీయ బదిరుల చెస్ ఛాంపియన్ షిప్ లో ఏడుసార్లు విజేతగా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో ఒక స్వర్ణం, రెండు రజత పతకాలు సాధించిన సమయంలో మాలికకు ప్రభుత్వ ఉద్యోగం, నగదు ప్రోత్సాహకం అందిస్తామని అప్పటి పంజాబ్ క్రీడలమంత్రి హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని పాలకులు నిలబెట్టుకోకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేస్తుందని ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేసింది మాలిక. ఆ వీడియో వైరల్  కావడంతో తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్  స్పందించారు. ‘‘మీకు వీలైతే ఈ యువ ఛాంపియన్ వివరాలు నాకు పంపండి. నా వ్యక్తిగత హోదాలో సహకారం అందిస్తాను” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.