కాంగ్రెస్ శ్వేతపత్రానికి కౌంటర్ గా బీఆర్ఎస్ స్వేదపత్రం

కాంగ్రెస్ శ్వేతపత్రానికి కౌంటర్ గా బీఆర్ఎస్ స్వేదపత్రం

గత తొమ్మిదన్నరేళ్లలో  బీఆర్ఎస్ పాలన ఒక సువర్ణధ్యాయమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో  రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన  కాంగ్రెస్ ప్రభుత్వం...  తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల పాలు చేసిందని తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంటర్ గా బీఆర్ఎస్  స్వేదపత్రాన్ని విడుదల చేసింది. డిసెంబర్ 24వ తేదీ ఆదివారం తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్.. 9ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.  

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. "తెలంగాణపై సమైక్య పాలనలో తీరని వివక్ష చూపించారు. గత పాలకులు తెలంగాణను నిర్లక్ష్యం చేశారు.  క్షమించరాని జీవన విధ్వంసానికి పాల్పడ్డారు. ఒకప్పుడు తెలంగాణ అంటేనే నెర్రలు బారిన నేలలు. 60ఏళ్ల గోసను 10ఏళ్లలో  మాయం చేసి చూపించారు కేసీఆర్.. 2014కు ముందు హైదరాబాద్ మినహా మిగిలిన 9 జిల్లాలు వెనుకబడ్డాయి.  రక్తాన్ని రంగరించి రాష్ట్రాన్ని ప్రగతిపథం వైపు నడిపించారు.

బీఆర్ఎస్ పాలనలో విధ్వంసం నుంచి వికాసం వైపు తెలంగాణ ప్రయాణం సాగింది. సంక్షోభం నుంచి సమృద్ధి వైపు పాలన సాగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. విద్యుత్  రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాం.మిషన్ భగీరథను నీతి ఆయోగ్ ప్రశంసించింది.  తలసరి ఆదాయంలో తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపాం. వృద్ధిరేటులో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారింది.  

కరోనా వల్ల రెండేళ్ల పాటు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంపై  కాంగ్రెస్ ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తోంది. ఉద్యమంలో ఏనాడు లేని కొంత మంది కాంగ్రెస్ నేతలు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ అవాస్తవాలు చెప్పింది. రూ.6లక్షల కోట్లు అప్పులు చేసినట్లు కాంగ్రెస్ ఆరోపించింది.

శ్వేతపత్రం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల గారడీ చేసింది.  తెలంగాణ ఏర్పడక ముందు పాత అప్పులు రూ.72 వేల కోట్లు.తొమ్మిదిన్నరేళ్ల కాలంలో రూ.3లక్షల 17వేల కోట్లు మాత్రమే అప్పు చేశాం. అర్ బిఐ నివేదికలనే మేం ప్రజల ముందుంచుతున్నాం.  మేం ఇచ్చిన సమాధానాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోయింది. కాంగ్రెస్, తెలంగాణను ఒక విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ అస్థిత్వాన్ని సృష్టించిన నాయకుడు కేసీఆర్" అని చెప్పుకొచ్చారు.