
కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి కౌంటర్ గా బీఆర్ఎస్ స్వేదపత్రాన్ని విడుదల చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం... తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల పాలు చేసిందని తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో డిసెంబర్ 24వ తేదీ ఆదివారం తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్.. 9ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం తప్పుల తడకగా, అంకెల గారడీగా ఉందని కేటీఆర్ విమర్శించారు.తెలంగాణ ఏర్పడక ముందు రూ.72 వేల కోట్ల పాత అప్పులు కూడా ఉన్నాయన్నారు. ఈ తొమ్మిదిన్నరేళ్ల కాలంలో మేం రూ.3లక్షల 17వేల 51 కోట్లు మాత్రమే అప్పు చేశామని తెలిపారు. అర్ బిఐ నివేదికలనే మేం ప్రజల ముందుంచుతున్నారు. కానీ, రాష్ట్రం అప్పు రూ.6.70లక్షల కోట్లు ఉండని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు, ఇవ్వని రుణాలు కూడా అప్పులుగా చూపుతున్నారని అన్నారు. కాంగ్రెస్.. మాపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆర్టీసీ, విద్యుత్, పౌరసరఫరాల్లో లేని అప్పు ఉన్నట్లు చూపించారనని ఆయన మండిపడ్డారు. పౌర సరఫరాల సంస్థకు ఇప్పటివరకు ఉన్న అప్పు రూ.21,029 కోట్లు మాత్రమేనని చెప్పారు. నిల్లు, కేంద్ర నుంచి రావాల్సిన డబ్బులు దాచి.. అప్పులు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతుందని కేటీఆర్ తెలిపారు.