బీజేపీ కార్పొరేటర్లు మోడీని కలవడంపై కేటీఆర్ ప్రశ్నల వర్షం

బీజేపీ కార్పొరేటర్లు మోడీని కలవడంపై కేటీఆర్ ప్రశ్నల వర్షం

జీహెచ్ ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడంపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. ‘మోడీ జీ, మీరు గవర్నమెంట్ ను నడుపుతున్నారా లేదా ఎన్జీవో నడుపుతున్నారా..? హైదరాబాద్‌కు వరద సాయం నిధుల్లో పురోగతి ఏది..? మూసీ నది పునరుద్ధరణ పనుల కోసం, లేదా హైదరాబాద్ మెట్రో పొడిగింపు కోసం ఏమైనా నిధులు ఇస్తున్నారా..? లేక ఐటీఐఆర్‌పై ఏదైనా అప్‌డేట్ ఉందా..? హైదరాబాద్, తెలంగాణకు మాటలు, గుజరాత్‌కు మాత్రం మూటలు’ అంటూ మంగళవారం రాత్రి (జూన్ 7న) ట్విట్టర్‌లో కేటీఆర్‌ ప్రశ్నల వర్షం కురిపించారు.

జీహెచ్​ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో మోడీ భేటీ
కష్టపడి పని చేస్తే తెలంగాణలో బీజేపీదే అధికారమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వచ్చే ఎన్నికల కోసం బాగా పని చేయాలని జీహెచ్​ఎంసీ కార్పొరేటర్లకు సూచించారు. కార్పొరేటర్లు బాగా పనిచేస్తే ప్రజలు బీజేపీతో ఉంటారని మోడీ చెప్పారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆదర్శంగా ఉండాలని అన్నారు. ప్రజలతో మమేకం కావాలని, వారి కష్టాసుఖాలను పంచుకుని తామున్నామనే భరోసా ఇవ్వాలని సూచించారు.

మంగళవారం (జూన్ 7న) బీజేపీకి చెందిన 47 మంది జీహెచ్​ఎంసీ కార్పొరేటర్లతో ప్రధాని మోడీ ఢిల్లీలోని లోక్​కల్యాణ్​ మార్గ్​లోని తన ఇంట్లో దాదాపు గంటన్నరపాటు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్​, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్​ వంటి సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఒక్కో కార్పొరేటర్​తో వ్యక్తిగతంగా మాట్లాడిన మోడీ.. అందరి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ వివరాలు, పిల్లల బాగోగులపై ఆరా తీసిన ఆయన.. కార్పొరేటర్​గా గెలవడంతోనే రాజకీయ జీవితం పూర్తి కాలేదని, ప్రజలకు మరింత చేరువ కావాలని వారికి సూచించారు. అంచెలంచెలుగా ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. జూన్​ 2, 3 తేదీల్లో బీజేపీ నేషనల్​ ఎగ్జిక్యూటివ్​ మీటింగ్​ కోసం హైదరాబాద్​కు వస్తానని, అప్పుడు మరిన్ని అంశాలు, ప్రజా సమస్యలపై చర్చిద్దామని కార్పొరేటర్లకు ప్రధాని మోడీ చెప్పారు.