సిట్టింగ్ ​ఎమ్మెల్యేలను మారిస్తే బాగుండేది : కేటీఆర్

సిట్టింగ్ ​ఎమ్మెల్యేలను మారిస్తే బాగుండేది : కేటీఆర్
  • ‘బంధు’ పథకాల ప్రభావం పార్టీపై పడింది
  • ఒకరికి సాయమందితే మరొకరు ఈర్ష్యపడేలా సమాజం తయారైంది 
  • లోక్​సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ.. బీఆర్​ఎస్​కే లాభం
  • బీఆర్ఎస్ ​వర్కింగ్​ప్రెసిడెంట్ ​కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్​ఎమ్మెల్యేలను మార్చి ఉంటే బాగుండేదని బీఆర్ఎస్ వర్కింగ్ ​ప్రెసిడెంట్ ​కేటీఆర్​ అన్నారు. పార్టీ ఓటమిపై సమీక్ష చేస్తున్నప్పుడు ఎక్కువ మంది నుంచి వచ్చిన ఫీడ్​ బ్యాక్​ ఇదేనని చెప్పారు. పార్లమెంట్​ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వబోమన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన జహీరాబాద్​ లోక్​సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘బంధు’ పథకాల ప్రభావం పార్టీపై పడిందని, ఒకరికి సాయమందితే మరొకరు ఈర్ష్యపడేలా సమాజం తయారైందన్నారు. 

నిజాంసాగర్​మండలంలో అందరికీ దళితబంధు ఇచ్చామని, దీంతో మిగతా వర్గాలు మనకు ఓట్లు వేయలేదన్నారు. కొత్త ఒక వింత పాత ఒక రోతలా ప్రజలు భావించారని.. కాంగ్రెస్​కు ఓట్లేసిన వాళ్లు కూడా కేసీఆర్​సీఎం కానందుకు బాధ పడుతున్నారని తెలిపారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్​ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుందని, ప్రజల నుంచి కాంగ్రెస్​ఎమ్మెల్యేలకు నిరసన సెగలు మొదలయ్యాయని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్​మధ్య త్రిముఖ పోటీ జరగబోతోందని.. మూడు ముక్కలాటలో తమకే అనుకూల పరిస్థితులు ఉంటాయన్నారు. కాంగ్రెస్​ప్రభుత్వం తిరోగమన చర్యలకు పాల్పడుతోందని, బీఆర్ఎస్ పథకాలను రద్దు చేస్తోందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్​కు ఓటేసిన వాళ్లు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారన్నారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు సీఎం రేవంత్​రెడ్డి కమిషన్​వేస్తానంటున్నారని.. జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం మీద బీఆర్ఎస్​తొందరపడి విమర్శలు చేయడంలేదన్నారు. 

పార్టీలో ప్రక్షాళన జరగాలే: పోచారం  

బీఆర్ఎస్ లో ప్రక్షాళన జరగాలని, నాయకులు నిత్యం ప్రజల్లో ఉండాలని ఆ పార్టీ నేత, మాజీ స్పీకర్​పోచారం శ్రీనివాస్​రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​తన శక్తితో గెలవలేదని, తమ బలహీనతలే ఆ పార్టీ గెలుపుకు కారణమన్నారు. కొందరు సొంత పార్టీ అభ్యర్థులను ఓడించారన్నారు. ఎన్నికల్లో ఓటమికి కార్యకర్తల తప్పు లేదని, నాయకులే బాధ్యత వహించాలన్నారు. కేసీఆర్ సీఎం కానందుకు ప్రజలు బాధ పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్​దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టలేకపోయామని, ప్రభుత్వ పనుల్లో పడి పార్టీని పట్టించుకోలేక పోయామని మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి అన్నారు. ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయని, వాటిని అధిగమించి పార్లమెంట్​ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలన్నారు. స్వల్ప అనారోగ్యం కారణంగా రెండు రోజుల పాటు పార్లమెంట్​సన్నాహక సమావేశాలకు దూరంగా ఉన్న కేటీఆర్​ఆదివారం జహీరాబాద్​సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. లంచ్​బ్రేక్​లో వీఐపీ లాంజ్​లో కాకుండా కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు.