నన్ను పిచ్చోన్ని చేసిన్రు : కేటీఆర్​

నన్ను పిచ్చోన్ని చేసిన్రు : కేటీఆర్​
  • రంజిత్​రెడ్డి, పట్నం మహేందర్​రెడ్డి ఆస్కార్ నటులు
  • కవితను ఈడీ అరెస్ట్​ చేస్తుంటే  నవ్వుకుంటూ కండువాలు కప్పుకున్నరు
  • కాంగ్రెస్​ను తిట్టి.. రెండువారాల్లోనే జంప్​ అయ్యారని మండిపాటు
  • కేకే, కడియం పార్టీ మార్పుపైనా అసహనం  
  • కాంగ్రెస్‌‌ పాలన చూసి ఆ పార్టీకి ఓటేసిన ప్రజలు తేలు కుట్టిన దొంగల్లాగా సైలెంట్‌‌గా ఉంటున్నరని వ్యాఖ్య 

హైదరాబాద్, వెలుగు: పార్టీ మారే విషయంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌‌రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్‌‌‌‌రెడ్డి తనను పిచ్చోన్ని చేశారని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​అన్నారు. ఇన్నాళ్లు తమ వెంట ఉన్న నాయకులు.. కష్టకాలంలో వదిలేసి వెళ్లిపోతున్నారని మండిపడ్డారు. పరిగి, తాండూరు, వికారాబాద్‌‌ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి వాళ్లే కారణం అని, పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. వాళ్లు మళ్లీ వచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా, పార్టీలోకి తీసుకునేది లేదని చెప్పారు. శుక్రవారం తెలంగాణ భవన్‌‌లో జరిగిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ ​మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రంజిత్‌‌రెడ్డి తనకు ఫోన్ చేసి, లోక్‌‌సభ ఎన్నికల ప్రిపరేషన్‌‌ను అడ్వాన్స్​గా మొదలు పెడ్తాం అని చెప్పారని, ఇందుకు తాను కూడా అంగీకరించానని అన్నారు.

ఆయన సూచనతోనే చేవెళ్ల, పరిగిలో మీటింగ్‌‌లు పెట్టామని తెలిపారు. పట్నం మహేందర్‌‌‌‌రెడ్డి, రంజిత్‌‌రెడ్డి పార్టీ మారుతున్నట్టు అప్పుడే ప్రచారం జరిగిందని అన్నారు. ఇదే విషయం తాను పట్నంతో ప్రస్తావించానని తెలిపారు. చేవెళ్ల, పరిగి మీటింగ్‌‌లో వారు ఈ అంశంపై స్పందిస్తూ .. కాంగ్రెస్‌‌ను అడ్డగోలుగా తిట్టారని, పార్టీ మారేది లేదని ఆస్కార్ లెవల్‌‌లో యాక్టింగ్ చేశారని అన్నారు. వాళ్ల మాటలను తాను కూడా నమ్మానని చెప్పారు.  రెండు వారాలు కూడా గడువకముందే ఇద్దరూ కాంగ్రెస్‌‌లో చేరి ఒకరు చేవెళ్ల నుంచి.. ఇంకొకరు మల్కాజ్‌‌గిరి నుంచి పోటీకి దిగారని, వారి మాటలు నమ్మిన తాను పిచ్చోన్నయ్యానని అన్నారు. ఓవైపు కవితను ఈడీ అరెస్ట్ చేస్తుంటే, అదేరోజు వాళ్లిద్దరూ నవ్వుకుంటూ కాంగ్రెస్‌‌లో చేరారని ఫైర్​  అయ్యారు.  ‘బయటోడు మోసం చేస్తే బాధ అనిపించదు. మహేందర్‌‌‌‌రెడ్డి, రంజిత్‌‌రెడ్డి నీడలా మన వెన్నంటే ఉండి కష్టకాలంలో మోసగించారు. ఆ ఇద్దరు మోసగాళ్లను ఓడించాలి’ అని  అన్నారు. గతంలో కొండా విశ్వేశ్వర్‌‌‌‌రెడ్డి కూడా ఇట్లనే పార్టీ మారారని, అప్పుడు రంజిత్‌‌రెడ్డిని తీసుకొచ్చి ఆయన్ను ఓడగొట్టామని తెలిపారు. ఏప్రిల్ 13న చేవెళ్లలో జరిగే కేసీఆర్ సభను సక్సెస్ చేయాలని కేటీఆర్​ కోరారు. 

కాలమే సమాధానం చెబుతుంది..

కేకే, కడియం శ్రీహరి పార్టీ మారడంపై కేటీఆర్ అసహనం వ్యక్తంచేశారు. ‘పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేకే, కడియం శ్రీహరి వంటి పెద్ద పెద్ద నాయకులు జారుకుంటున్నరు. పదేండ్లు అన్నీ అనుభవించి పోతూ పోతూ రెండు  మూడు రాళ్లేసి పోతున్నరు. కానీ, వాళ్లు పెద్దవాళ్లు.. వాళ్లను నేనేమీ అనదల్చుకోలేదు. వాళ్ల విజ్ఞతకే వదిలేద్దాం. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది’ అని  వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌‌ పాలన చూసి ఆ పార్టీకి ఓటేసిన ప్రజలు తేలుకుట్టిన దొంగల్లాగా సైలెంట్‌‌గా ఉంటున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వాళ్లు ఇప్పుడు బీఆర్‌‌‌‌ఎస్‌‌కు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దేశంలో కాంగ్రెస్‌‌కు 40 సీట్లకు మించి వచ్చే అవకాశం లేదని అన్నారు.  కాగా, చేవెళ్లలో తప్పకుండా గెలుస్తాం అని ఆ నియోజకవర్గ బీఆర్​ఎస్​ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్​ దూరం

కేటీఆర్ నిర్వహించిన చేవెళ్ల సన్నాహక సమావేశానికి ఆ పార్టీ  నేత, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌‌గౌడ్ హాజరు కాలేదు. ఆయన కాంగ్రెస్‌‌లోకి వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇటీవల సీఎం రేవంత్‌‌రెడ్డిని కూడా కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన మీటింగ్‌‌కు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ప్రకాశ్‌‌గౌడ్ గురువారం కేసీఆర్‌‌‌‌ను కలిశారని, తన మనవరాలి పెండ్లికి రమ్మని ఆహ్వానించారని మీటింగ్‌‌లో కేటీఆర్  చెప్పారు.