
- డిసెంబర్ 3 తర్వాత ప్రక్షాళన చేస్తం
- ప్రతిపక్షాల మాటలు యువత నమ్మొద్దు
- ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చి.. ఉద్యోగాలు భర్తీ చేస్తం
- సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి
- బీఆర్ఎస్వీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి కామెంట్స్
హైదరాబాద్, వెలుగు: డిసెంబర్ మూడు తర్వాత టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎస్పీఎస్సీలో కొన్ని తప్పులు జరిగాయని, నిజం ఒప్పుకోవడానికి కూడా ధైర్యం కావాలన్నారు. ఇప్పుడు వివిధ దశల్లో ఉన్న 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ఏటా జాబ్‌క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ప్రతిపక్షాలు చెప్పే మాయమాటలు యువత నమ్మొద్దని పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థి నాయకులు కేటీఆర్సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. వారి నినాదాలతో కేటీఆర్ కొంత సేపు మాట్లాడలేకపోయారు. పేపర్ లీక్ చేసిందే బండి సంజయ్ చెంచాగాడు అని.. గ్రూప్–2 రద్దు చేయాలని డిమాండ్ చేసిందే బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అని.. పరీక్షను రద్దు చేస్తే మళ్లీ గొడవ చేసేది.. కోర్టుల్లో కేసులు వేయించేది కూడా వాళ్లేనన్నారు. కడుపులో గుద్ది నోట్లో పిప్పరమెంట్పెట్టినట్టుగా వాళ్ల తీరు ఉందన్నారు. 2014కు ముందు తెలంగాణ, ఊర్లు ఎట్లా ఉండే బీఆర్ఎస్ప్రభుత్వంలో ఎట్లా మారాయో ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. సోషల్‌మీడియాను ఉపయోగించుకొని బీజేపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. గ్రామాల్లో కేసీఆర్చేసిన అభివృద్ధి పనులతో సెల్ఫీలు దిగి సోషల్‌మీడియాలో పోస్ట్చేయాలని సూచించారు. కేసీఆర్ఏం చేశారని ప్రశ్నిస్తున్న వాళ్లకు అభివృద్ధి సెల్ఫీలతో సమాధానాలు చెప్పాలన్నారు.
కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు..
ఎన్నికల్లో బీఆర్ఎస్తో పోటీ పడుతున్న కాంగ్రెస్‌పార్టీ యువత, విద్యార్థులను చంపిందని కేటీఆర్అన్నారు. వందలాది యువత ప్రాణాలను బలితీసుకున్న సోనియా గాంధీని బలిదేవత అని ప్రస్తుత పీసీసీ చీఫ్ అన్నారని గుర్తు చేశారు. పొరపాటున కూడా కాంగ్రెస్‌ను నమ్మొద్దని పిలుపునిచ్చారు. బీసీ రాష్ట్ర అధ్యక్షుడిని తొలగించిన బీజేపీ.. బీసీ సీఎం అంటూ మొసలి కన్నీరు కారుస్తోందన్నారు. ‘‘ఒకరు మతం అంటారు.. ఇంకొకరు కులం అంటారు. కులం, మతం కన్నా గుణం ముఖ్యం. అభివృద్ధి, సంక్షేమం చేయాలనే సంకల్పమున్న కేసీఆర్‌కే అండగా నిలువాలి. కేసీఆర్రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచుతున్నారు”అని తెలిపారు. నోట్ల కట్టలతో అడ్డంగా దొరికినోడు అమరవీరుల స్తూపం దగ్గరికి రావాలని సవాల్ చేస్తున్నాడని, అలాంటి దొంగలను నమ్మొద్దన్నారు. మాయమాటలతో మోసపోతే అభివృద్ధిలో 50 ఏళ్లు వెనక్కి పోతామని తెలిపారు. డీకే శివకుమార్ఇక్కడికి నోట్ల కట్టలతో వచ్చి తమ రాష్ట్రంలో వ్యవసాయానికి ఐదు గంటల కరెంట్ఇస్తున్నామని చెప్తున్నారని ఎద్దేవా చేశారు. 24 గంటల కరెంట్ఇచ్చే తెలంగాణకు వచ్చి తమ రాష్ట్రంలో ఐదు గంటల కరెంట్ఇస్తున్నామంటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కాని పరిస్థితిలో రైతులు ఉన్నారని అన్నారు.
మధుయాష్కీకి ఎల్బీనగర్ కాలనీల పేర్లు కూడా తెల్వవ్: కేటీఆర్
ఎల్బీనగర్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ అల్లర్లు, అరాచకాలు జరుగుతాయని, మాయమాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. కనీసం ఎల్బీనగర్లో కాలనీల పేర్లు కూడా తెలియని మధుయాష్కీని కాంగ్రెస్ ఇక్కడ పోటీలో నిలబెడుతున్నదని, వాళ్లు సీట్లు పంచుకునేలోపు.. మనం స్వీట్లు పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధి పనులతో సెల్ఫీలు దిగి ప్రజలను ఓట్లు అడగాలని కేటీఆర్ కార్యకర్తలకు సూచించారు. ఎల్బీనగర్ హస్తినాపురంలోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో ఎల్బీనగర్ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించగా, మంత్రి కేటీఆర్ హాజరై మాట్లాడారు. గత 9 ఏండ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బూత్ స్థాయి కార్యకర్తలపై ఉందన్నారు. ప్రతి కార్యకర్త 30 రోజులు నిరుత్సాహానికి గురికాకుండా ఇంటింటికీ తిరిగి ఓటు అడగాలని అన్నారు. అప్పట్లో ఓటుకు నోటు.. ఇప్పుడు సీటుకు రేటు కట్టి అమ్ముకుంటున్న దొంగల చేతిలో తెలంగాణను పెట్టొద్దని అన్నారు. కాంగ్రెస్‌లో జానా రెడ్డి సహా ఆరేడు మంది సీఎంలు అయ్యేందుకు రెడీ అవుతున్నారని ఎద్దేవా చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సుధీర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.2018 తర్వాత ఎల్బీనగర్లో రోడ్లు, పార్కులు, ఫ్లైఓవర్లు, మంచినీటి సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, సీనియర్ నాయకులు జోగు రాములు, సామ తిరుమల్ రెడ్డి, ముద్రబోయిన శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
24 లక్షల ఉద్యోగాలు
బీఆర్ఎస్వీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజన సమ్మేళనాలు నిర్వహించి బీఆర్ఎస్ను ఎందుకు గెలిపించుకోవాలో యువతకు చెప్పాలని కేటీఆర్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమంపై చర్చ పెట్టాలని, 2014కు ముందు పరిస్థితి ఎలా ఉండేది.. ఈ తొమ్మిదిన్నరేళ్లలో జరిగిన అభివృద్ధి ఏమిటో అర్థమయ్యేలా చెప్పాలన్నారు. పార్లమెంట్ లోనే ముస్లిం ఎంపీలకు రక్షణ లేకుండా పోయిందని, ఎంపీని పట్టుకొని ఉగ్రవాది అంటున్నారని.. తెలంగాణలో అన్ని మతాలు, కులాల వాళ్లు స్వేచ్ఛగా జీవిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లలో పది వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తే.. కేసీఆర్ప్రభుత్వం1.31 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు. టీఎస్ఐపాస్ద్వారా ప్రైవేట్‌రంగంలో 24 లక్షల ఉద్యోగాలు సృష్టించామన్నారు. మన రాష్ట్రంలో పని చేయడానికి స్థానిక యువతకు నామోషీ ఎందుకో అర్థం కావడం లేదన్నారు. ఎక్కడో దుబాయ్‌కి వెళ్లి పని చేయడం కన్నా స్థానికంగా పని చేసుకుంటే అంతకన్నా ఎక్కువే సంపాదించొచ్చు అని అన్నారు. భవిష్యత్‌లోనూ విద్యార్థి నాయకులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు స్వామి, బాలు తదితరులు పాల్గొన్నారు.