హుజూరాబాద్‌‌‌‌ ఉప ఎన్నిక సీరియస్​ విషయం కాదు

హుజూరాబాద్‌‌‌‌ ఉప ఎన్నిక సీరియస్​ విషయం కాదు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హుజూరాబాద్‌‌‌‌ ఉప ఎన్నిక సీరియస్‌‌‌‌ విషయం కాదని టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్​, మంత్రి కేటీఆర్‌‌‌‌ అన్నారు. ఆ ఎన్నిక చర్చనీయాంశం కూడా కాదని చెప్పారు. సీఎం కేసీఆర్‌‌‌‌ హుజూరాబాద్​ ప్రచారానికి వెళ్తే సమాచారమిస్తామని తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్‌‌‌‌లో కేటీఆర్​ మీడియాతో మాట్లాడారు. పార్టీ ప్లీనరీని ఈ నెల 25న హెచ్‌‌‌‌ఐసీసీలో నిర్వహిస్తామని వెల్లడించారు. అదే రోజు ఉదయం నిర్వహించే పార్టీ ప్రతినిధుల సభలో రాష్ట్ర కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని, ఆ తర్వాత ప్లీనరీ ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 17న టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ జాయింట్‌‌‌‌ లెజిస్లేటివ్‌‌‌‌ మీటింగ్‌‌‌‌ కేసీఆర్‌‌‌‌ అధ్యక్షతన నిర్వహిస్తామన్నారు. టీఆర్‌‌‌‌ఎస్‌ను స్థాపించి 20 ఏండ్లు గడిచిందని, ఏడేండ్ల పాలనలో ఎన్నో విజయాలు సాధించామని చెప్పారు. వీటిని ప్రజలందరికీ తెలియజేప్పేందుకు నవంబర్‌‌‌‌ 15న వరంగల్‌‌‌‌లో ‘విజయ గర్జన’ మహాసభ నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లో టీఆర్​ఎస్​ కమిటీలు, అనుబంధ కమిటీలు వేశామని కేటీఆర్​ చెప్పారు. వార్డు, డివిజన్‌‌‌‌, బస్తీ, పట్టణ, నగర కమిటీల ఎన్నిక పూర్తి చేశామన్నారు. సాధారణంగా ఏప్రిల్‌‌‌‌ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ నిర్వహించుకుంటామని, పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల కారణంగా 2019లో, కరోనాతో 2020లో ఆ తేదీన ప్లీనరీ నిర్వహించలేకపోయామని పేర్కొన్నారు.

కరోనా కట్టడిలో దేశంలోనే ముందున్నం

కరోనా కట్టడిలో, వ్యాక్సినేషన్‌‌‌‌లో దేశంలో ముందంజలో ఉన్నామని కేటీఆర్​ అన్నారు. కొన్ని రోజుల్లోనే వంద శాతం వ్యాక్సినేషన్‌‌‌‌ కూడా పూర్తి చేస్తామని చెప్పారు. అందుకే పార్టీ ప్లీనరీ, ప్రతినిధుల సభ అట్టహాసంగా నిర్వహించాలని పార్టీ చీఫ్​ కేసీఆర్‌‌‌‌ ఆదేశించారని చెప్పారు. ఎన్నికల కమిషన్‌‌‌‌ నిబంధనలకు లోబడి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రతినిధుల సభలో ఎన్నుకుంటామని, 13 వేల మందికిపైగా ప్రతినిధులు ఈ సభకు హాజరవుతారని తెలిపారు.

అధ్యక్షుడి ఎన్నికకు 17న నోటిఫికేషన్​

టీఆర్​ఎస్​ అధ్యక్షుడి ఎన్నికకు కేటీఆర్​ షెడ్యూల్‌‌‌‌ విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి రిటర్నింగ్‌‌‌‌ అధికారిగా వ్యవహరిస్తారని, పర్యవేక్షకులుగా పర్యాద కృష్ణమూర్తి, భరత్‌‌‌‌కుమార్‌‌‌‌ గుప్తా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ నెల 17న అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్‌‌‌‌ విడుదల చేస్తారని, ఆ రోజు నుంచి 22 వరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారని చెప్పారు. 23న స్క్రూటినీ ఉంటుందని, 24న విత్‌‌‌‌డ్రా చేసుకోవచ్చన్నారు. ఈ నెల 25న ఎన్నిక ఉంటుందని తెలిపారు. ఎన్నికల అనంతరం పార్టీ ప్లీనరీ నిర్వహిస్తామన్నారు. ప్లీనరీలో చేయాల్సిన తీర్మానాల కమిటీ అధ్యక్షుడిగా మాజీ స్పీకర్‌‌‌‌ మధుసూదనాచారి వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు. పార్టీ ప్లీనరీపై చర్చించేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ భవన్‌‌‌‌లో జాయింట్‌‌‌‌ లెజిస్లేచర్‌‌‌‌ మీటింగ్‌‌‌‌ ఈ నెల 17న మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహిస్తామన్నారు.

ఏడేండ్ల మా పాలనలో ఎన్నో అద్భుత విజయాలు

తెలంగాణ సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన ఉద్యమ పార్టీ 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత లక్ష్యాన్ని సాధించిందని కేటీఆర్​ పేర్కొన్నారు.  కేసీఆర్‌‌‌‌ తిరుగులేని రాజకీయ శక్తిగా నిలిచారని అన్నారు. ఈ ఏడేండ్ల జనరంజక పాలనలో తెలంగాణ ఎన్నో అద్భుత విజయాలు సాధించిందని చెప్పారు.  2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారీ విజయాన్ని అందించినా పలు కారణాలతో ఉత్సవాలు నిర్వహించుకోలేదన్నారు. చిరస్మరణీయ స్థాయిలో పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను వరంగల్‌‌‌‌ కేంద్రంగా ‘విజయ గర్జన’ సభ పేరుతో నిర్వహిస్తామన్నారు. దీన్ని విజయవంతం చేయడానికి ఈ నెల 27న నియోజకవర్గ స్థాయిలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. సభ తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ ఆఫీసులను ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్‌‌‌‌, వరంగల్‌‌‌‌ మినహా మిగతా అన్ని జిల్లాల్లో పార్టీ ఆఫీసుల నిర్మాణం పూర్తయిందని చెప్పారు.  పార్టీ రాష్ట్ర కమిటీని, జిల్లా అధ్యక్షులను కొత్త అధ్యక్షుడి ఎన్నిక తర్వాత ఆయనే ప్రకటిస్తారని కేటీఆర్​ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో టీఆర్​ఎస్​ సెక్రటరీ జనరల్‌‌‌‌ కె. కేశవరావు, మంత్రులు మహమూద్‌‌‌‌ అలీ, శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌, ఎంపీ రంజిత్‌‌‌‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.