ఫార్ములా ఈ–రేస్ పై కేటీఆర్ ట్వీట్

ఫార్ములా ఈ–రేస్ పై కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్, వెలుగు:  ఫార్ములా ఈ–రేస్ రద్దు నిర్ణయంపై కేటీఆర్ ట్విట్టర్‌‌‌‌లో స్పందించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దారుణమైన, తిరోగమన చర్య అని పేర్కొన్నారు. ఇలాంటి ఈవెంట్స్ ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌‌తో పాటు దేశం బ్రాండ్ ఇమేజ్‌‌ను పెంచుతాయన్నారు. భారతదేశానికి మొదటిసారిగా ఫార్ములా ఈ–-ప్రిక్స్‌‌ను తీసుకురావడానికి తాము చాలా కృషి చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌‌ను ఆకర్షణీయమైన పెట్టుబడి కేంద్రంగా మార్చడానికి దీన్ని ఉపయోగించుకున్నామన్నారు. 

ఈవీ ఔత్సాహికులు, తయారీదారులు స్టార్టప్‌‌లను ఆకర్షిస్తూ ఒక వారం పాటు ఈవీ సమ్మిట్‌‌ను నిర్వహించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్‌‌ను వినియోగించుకుందని వెల్లడించారు. ఈ తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేస్ ను రద్దు చేయడం సమంజసం కాదన్నారు. ఇలాంటి చర్యలు రాష్ట్రానికి చాలా నష్టం కలిగిస్తాయన్నారు.