ఫాక్స్‌‌కాన్‌‌ను బెంగళూరుకు తరలించే కుట్ర : కేటీఆర్

ఫాక్స్‌‌కాన్‌‌ను బెంగళూరుకు తరలించే కుట్ర : కేటీఆర్
  • ఆ కంపెనీ చైర్మన్‌‌కు డీకే శివకుమార్ లేఖ రాసిండు: కేటీఆర్
  • ఇక్కడ కాంగ్రెస్ సర్కారొస్తే ఒప్పించి.. హైదరాబాద్​ నుంచి తరలిస్తాడట
  • కేసీఆర్ మళ్లీ రాకపోతే ఏం జరుగుతుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ
  • కడుపులు కొట్టే కాంగ్రెస్​ కావాలా? కడుపులు నింపే బీఆర్ఎస్​ కావాలా?
  • ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తున్నది.. కానీ ఇంకొకరి చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే ఆగమైతమని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో లక్ష మందికి ఉద్యోగాలిచ్చే ఫాక్స్‌‌‌‌‌‌‌‌కాన్ కంపెనీని బెంగళూరుకు తరలించుకుపోయేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సెప్టెంబర్ 25న ఫాక్స్‌‌‌‌‌‌‌‌కాన్ చైర్మన్ యంగ్ ల్యూకు లెటర్​రాశారని చెప్పారు. శనివారం జల విహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘బెంగళూరులో ఫాక్స్‌‌‌‌‌‌‌‌కాన్ కంపెనీ పెట్టాలని ఆశపడటంలో తప్పులేదు.

కానీ డీకే శివకుమార్​ఆ లేఖలో ఇంకా కొన్ని కామెంట్స్​చేశారు. ఆ లేఖను సోషల్ మీడియాలో ఎక్కువ మందికి చేర్చాలి. ‘తొందరలోనే తెలంగాణలో కాంగ్రెస్​గవర్నమెంట్​వస్తుంది.. ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి హైదరాబాద్ నుంచి పరిశ్రమలను బెంగళూరుకు తరలిస్తాం.. ఇందుకు అక్కడి (తెలంగాణ) ప్రభుత్వం సహకరిస్తుంది’ అని శివకుమార్ రాశారు. ఈ లెక్కన కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రాకపోతే ఏం జరుగుతుందో చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ’’ అని కేటీఆర్ అన్నారు. ఢిల్లీ చేతిలోకి మన జుట్టు ఇస్తే.. కొట్లాడే మొనగాడు, తెలంగాణ ప్రయోజనాలు పరిరక్షించే నాయకుడు లేకపోతే.. మన పరిస్థితి ఇలాగే తయారవుతుందని అన్నారు.

ఫాక్స్‌‌‌‌‌‌‌‌కాన్‌‌‌‌‌‌‌‌ను రప్పించడానికి ఎంతో కష్టపడినం

‘‘కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు ఇవ్వాల బెంగళూరు అడ్డా అయిపోయింది. ఢిల్లీతో పాటు బెంగళూరులో కూడా కాంగ్రెస్ టికెట్లు డిసైడ్​అవుతున్నాయి.. పైసలన్నీ బెంగళూరు నుంచి వస్తున్నయ్. తనిఖీల్లో దొరుకుతున్నాయి. సిద్ధరామయ్య, డీకే శివకుమార్​ కష్టపడి సంపాదించిన పైసలు తెలంగాణకు తరలిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు అధికారమిస్తే లక్ష ఉద్యోగాలిచ్చే ఫాక్స్‌‌‌‌‌‌‌‌కాన్‌‌‌‌‌‌‌‌ను బెంగళూరుకు తరలిస్తారు” అని కేటీఆర్ హెచ్చరించారు.

చైనాలో 15 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఫాక్స్‌‌‌‌‌‌‌‌కాన్‌‌‌‌‌‌‌‌ను ఇక్కడికి తెప్పించడానికి ఎంతో కష్టపడ్డామని చెప్పారు. 2022లో ఆ సంస్థ చైర్మన్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు వచ్చి పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారని, కొంగరకలాన్​లో 200 ఎకరాల్లో ఆ సంస్థ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నదని తెలిపారు. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ప్రారంభానికి సిద్ధమవుతున్న ఆ కంపెనీని తరలించుకు పోయే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు.

ఆ ఆలోచనే ప్రజలకు రావొద్దు

‘‘తెలంగాణ లాంటి అభివృద్ధి, సంక్షేమ మోడల్​దేశంలో ఇంకెక్కడా లేదు. మూడున్నర కోట్ల టన్నుల వడ్లు పండిస్తున్నాం. హరితహారంతో 7.7 శాతం గ్రీన్​కవర్​పెరిగింది. రాష్ట్రానికి ఎన్నో ఇండస్ట్రీస్​వచ్చాయి. దమ్ము, దక్షత ఉన్న కేసీఆర్​లాంటి నాయకుడు ఉన్నాడు కాబట్టే రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, బీమా, దళితబంధు లాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగం అయిపోతదని అన్నోళ్లే ఇప్పుడు అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారు” అని కేటీఆర్ అన్నారు.

2014, 2018లో ప్రజలు బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌నే నమ్మారని, ఇప్పుడు కూడా నమ్ముతున్నారని తెలిపారు. తెలంగాణ సీఎంగా ఎవరు ఉండాలన్నది నిర్ణయించాల్సింది మోదీ, రాహుల్​గాంధీ కాదని, తెలంగాణ ప్రజలని అన్నారు. ‘‘రెండుసార్లు వీళ్లకు అధికారం ఇచ్చాం.. వాళ్లకు ఒక్క చాన్స్​ఇద్దాం అనే ఆలోచనే ప్రజలకు రావొద్దు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు 11 సార్లు చాన్స్​ఇస్తే నీళ్లు, కరెంట్​కూడా ఇవ్వకుండా చావగొట్టారు. రెండుసార్లు అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తున్నది. కానీ ఇంత కష్టపడి అభివృద్ధి చేసుకున్న రాష్ట్రాన్ని ఇంకొకరి చేతుల్లో పెడితే ఆగమైపోతుందని గుర్తించాలి. చిన్న చిన్న సమస్యలేమైనా ఉంటే అందరం కలిసి పరిష్కరించుకుందాం. కేసీఆర్​లాంటి నాయకుడు ఉంటేనే మన రాష్ట్రం, మన పిల్లలు సురక్షితంగా ఉంటారు” అని చెప్పారు.

ఢిల్లీ దొరల ముందు తలవంచబోం

తెలంగాణ ప్రజల కోసం చావనైనా చస్తాం గానీ ఢిల్లీ దొరల ముందు తలవంచబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘‘బీజేపీ వచ్చేది లేదు.. సచ్చేది లేదు. అందుకే ‘బీసీ సీఎం’ అంటున్నది. ఓడిపోతానని తెలిసే కిషన్​రెడ్డి అంబర్​పేటలో కాలేరు వెంకటేశ్​మీద నిలబడటానికి భయపడ్డారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో 11 మంది సీఎంలు ఉన్నారు. వాళ్లకు పదవులు కావాలి తప్ప ప్రజల సంక్షేమం అవసరం లేదు. కర్నాటకలో క్యాంప్​పెట్టి తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారు.

ఓటుకు పైసలు పంచుకుంటూ దొరికిన రేవంత్​రెడ్డి గన్​పార్క్​దగ్గరికి రావాలని సవాల్​చేయడం ఎంత సిగ్గు చేటు” అని మండిపడ్డారు. తెలంగాణ ఇవ్వడంలో జాప్యం చేసి యువతను బలితీసుకున్నదే కాంగ్రెస్​పార్టీ అన్నారు. మన కడుపులు కొట్టే కాంగ్రెస్​కావాలా.. కడుపులు నింపే బీఆర్ఎస్​కావాలా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. రిస్క్​తీసుకోవద్దని, తెలంగాణను ఇంకొకరి చేతుల్లో పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రగతి ఇలాగే కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్​ప్రభుత్వమే రావాలని ప్లానింగ్​బోర్డు వైస్​చైర్మన్​ బి. వినోద్​కుమార్​అన్నారు. తనను మళ్లీ గెలిపించి అడ్వొకేట్లు కేసీఆర్​కు కానుక ఇవ్వాలని అంబర్​పేట్​ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్​విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు మద్దతునివ్వాలని బార్ కౌన్సిల్ మెంబర్ ​గండ్ర మోహన్ రావు కోరారు.