రాహుల్, రేవంత్‌‌‌‌ను ఉరితీయాలి..ఎన్నో హామీలిచ్చి ఎగ్గొట్టిన్రు: కేటీఆర్

రాహుల్, రేవంత్‌‌‌‌ను ఉరితీయాలి..ఎన్నో హామీలిచ్చి ఎగ్గొట్టిన్రు: కేటీఆర్
  • 2 లక్షల ఉద్యోగాలు, బీసీ రిజర్వేషన్లపై రాహుల్ మాట తప్పారు
  • 420 హామీలతో ప్రజలను మోసం చేశారని విమర్శలు

హైదరాబాద్, వెలుగు:  ఎన్నో హామీలిచ్చి ఎగ్గొట్టిన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిని ఉరితీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘ఉరిశిక్షల గురించి సీఎం రేవంత్​మాట్లాడుతున్నారు. మరి ఎన్నో హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్​నాయకులకు ఎన్ని ఉరిశిక్షలు వేయాలి? అశోక్‌నగర్​అడ్డాపైకి వచ్చి 2 లక్షల ఉద్యోగాలిస్తామని, వరంగల్​సభ సాక్షిగా రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్​గాంధీ హామీ ఇచ్చారు. వాటిని ఇప్పటివరకు నెరవేర్చలేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ హామీ ఇచ్చి మాట తప్పారు. 420 హామీలిచ్చి ఎగ్గొట్టిన సీఎం రేవంత్, రాహుల్‌ను ఎన్నిసార్లు ఉరితీయాలి?” అని ప్రశ్నించారు. ‘నదీజలాలు–కాంగ్రెస్​ద్రోహాలు’ పేరుతో ఆదివారం తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు పవర్​పాయింట్​ప్రజెంటేషన్​ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్​మాట్లాడారు. సీఎం రేవంత్​రెడ్డికి తిట్టడం తప్ప, మరో భాష రాదని ఆయన మండిపడ్డారు. కావాలంటే మూణ్నాలుగు భాషల్లో సమాధానం చెప్పగల శక్తి తమకు ఉందన్నారు. ‘‘రేవంత్‌కు ఐఐటీ, ట్రిపుల్​ఐటీకి మధ్య తేడా తెల్వదు. బచావత్, బ్రజేశ్​ట్రిబ్యునళ్లకు మధ్య తేడా తెలియని అజ్ఞాని.. తెలంగాణ భవిష్యత్తుపై మాట్లాడడం హాస్యాస్పదం. కృష్ణా, గోదావరి బేసిన్లు అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తికి తెలంగాణకు ఏం కావాలో ఎలా తెలుస్తుంది? రేవంత్.. దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఇంకేమీ తెలియని అజ్ఞాని. ఇది ఉష్ట్రపక్షి పాలన’’ అని ఫైర్ అయ్యారు. 

ఆ ప్రాణాలకు సమాధానమెవరు చెప్తరు?

సీఎం రేవంత్​పాలనలో ఇప్పటికే వందలాది మంది రైతులు, ఆటో డ్రైవర్లు, గురుకుల విద్యార్థులు, నేతన్నలు ప్రాణాలు కోల్పోయారని.. ఈ ప్రాణాలకు ఎవరు సమాధానం చెప్తారని కేటీఆర్​ప్రశ్నించారు. ఆయన తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీ ఎత్తిన చరిత్రను ప్రజలు మర్చిపోలేదన్నారు. ‘‘సీఎం తన వికృతమైన మాటలతో కేసీఆర్​స్థాయిని ఏమాత్రం తగ్గించలేరు. అసెంబ్లీలో జరుగుతున్న చర్చల తీరు, సీఎం మాట్లాడుతున్న భాషను చూసిన తర్వాత.. వినాశకాలే విపరీత బుద్ధి అనే సామెత గుర్తుకు వస్తున్నది. అధికార మదంతో విర్రవీగుతూ, అహంకారంతో, పరుషమైన మాటలతో మాట్లాడటం ప్రజాస్వామ్యానికే అవమానం. తెలంగాణ విముక్తి కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టి పోరాడిన నాయకుడు కేసీఆర్. చావునోట్లో తలపెట్టి తెలంగాణ బతుకును కోరిన త్యాగధనుడు ఆయన. అలాంటి నాయకుడిపై అహంకారంతో, ద్వేషంతో మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజల గుండె రగిలిపోతున్నది” అని అన్నారు.

 ‘‘నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నది ఇప్పటి సమస్య కాదు. నిజాం కాలం తర్వాత 65 ఏండ్ల కాంగ్రెస్ పాలన, ఆపై 17 ఏండ్ల చంద్రబాబు పాలనలోనే ఈ ద్రోహం జరిగింది. తెలంగాణకు జరిగిన అన్యాయానికి ఆ రెండు పార్టీలే పూర్తి బాధ్యత వహించాలి. తెలంగాణ ప్రయోజనాల కోసం మేం పోరాడుతూనే ఉంటాం. దేవాదుల ఏ బేసిన్‌లో ఉందో కూడా తెలియని వ్యక్తి ఇరిగేషన్‌పై ఉపన్యాసాలు ఇవ్వడం విడ్డూరంగా ఉంది. వట్టెం పంప్‌హౌస్​మునిగినా చర్యల్లేవు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్​కూలి 8 మంది కార్మికులు చనిపోతే ఇప్పటికీ శవాలను వెలికితీయలేని అసమర్థ ప్రభుత్వం ఇది. కాంగ్రెస్​ రెండేండ్ల పాలనలో పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలే తప్ప అభివృద్ధి లేదు’’ అని విమర్శించారు.