- తొందరపడి ఓటేయొద్దని కేసీఆర్ చిలుకకు చెప్పినట్టు చెప్పినా ప్రజలు వినలే
- 2023లో బీఆర్‌ఎస్‌కు దెబ్బ మీద దెబ్బలు
- దానివల్ల కార్యకర్తల్లో నిరుత్సాహం అలుముకున్నదని కామెంట్
హైదరాబాద్, వెలుగు: అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అధికారం రావడం, పోవడం సాధారణమేనని బీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నాయకులు, ప్రభుత్వాలు మారుతుంటాయని, ప్రజల తలరాతలు మారాయా? లేదా? అన్నది చూడాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో తప్పులు జరగలేదని తాను అనడం లేదన్నారు. 2023లో బీఆర్‌ఎస్‌కు చాలా షాకులు మీద షాకులు తగిలాయని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని, పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బ తిన్నామని చెప్పారు. ఆ తర్వాత కేసీఆర్‌కు ఫ్రాక్చర్ అయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ శ్రేణుల్లో కొంత నిరుత్సాహం సహజమని పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని గుర్తు చేశారు. తొందరపడి ఓటేసి ఆగం కావొద్దంటూ కేసీఆర్ చిలుకకు చెప్పినట్టు చెప్పినా ప్రజలు వినలేదని వ్యాఖ్యానించారు.
కల్వకుర్తిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ఓడిపోతారని కేసీఆర్ ముందే చెప్పారన్నారు. బుధవారం కల్వకుర్తికి చెందిన పలు పార్టీలకు చెందిన నేతలు తెలంగాణభవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు అన్ని రంగాల్లో మోసపోయారని అన్నారు. ‘‘రాష్ట్రంలో 140 మంది గురుకుల విద్యార్థులు చనిపోయినా రేవంత్ రెడ్డికి సిగ్గు అనిపించడం లేదు. కనీసం కోతలు లేకుండా కరెంట్ ఇవ్వలేకపోతున్నందుకు, రైతుబంధు రైతుల ఖాతాల్లో వేయలేకపోతున్నందుకు సిగ్గు అనిపిస్తుందా? లేదా? ధాన్యం రోడ్ల మీద తడిసి రైతులు ఏడుస్తుంటే బాధ అనిపించట్లేదా? ’’ అని ప్రశ్నించారు.
విద్యార్థుల భవిష్యత్తు గందరగోళం
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకుండా వారి భవిష్యత్తును సీఎం రేవంత్‌రెడ్డి గందరగోళంలోకి నెడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు కాలేజీ చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టుకు వెళ్తే.. ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుంటే తల్లిదండ్రుల నుంచి కాలేజీ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకోవచ్చంటూ కోర్టు తీర్పు చెప్పిందన్నారు. ఇలాంటి తీర్పుతో విద్యార్థుల చదువులు అంధకారంలో కూరుకుపోయినా ప్రభుత్వానికి సిగ్గనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు.
రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాత రైతు బంధు పూర్తిగా ఆగిపోయిందని, చివరికి రైతన్నలకు యూరియా బస్తాలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. రాష్ట్రంలో ధాన్యం, మక్కలు, శనగలు, జొన్నలలాంటి పంటల కొనుగోళ్లు దాదాపుగా నిలిచిపోయాయన్నారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్న రేవంత్ కనీసం పాలమూరు కోసమైనా ఒక్క మంచి పనిచేశారా? అని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిన 10 శాతం పనులను కూడా పూర్తి చేయడం లేదని ఆరోపించారు.

