ఆరు నెలల్లో ప్రజలే తిరగబడతారు: కేటీఆర్

ఆరు నెలల్లో  ప్రజలే తిరగబడతారు: కేటీఆర్

హైదరాబాద్‌:  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నెల రోజులకే ప్రజల్లో నమ్మకం పోతుందన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అప్పుడే ప్రజలకు కష్టాలు మొదలయ్యామని.. ఆరు నెలల్లో కాంగ్రెస్  ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని జోష్యం చెప్పారు. జనవరి 18వ తేదీ గురువారం తెలంగాణ భవన్ లో బీఆర్‌ఎస్‌ మహబూబ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కేటీఆర్ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి మాట్లాడారు.  చురుకైన నాయకులు, కార్యకర్తల సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందన్నారు. జిల్లా కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను మరింత యాక్టివేట్ చేస్తామని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని చెప్పారు. 
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయని.. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని అప్పుడే మనం విజయం సాధిస్తామన్నారు.

ఎన్నికల్లో ప్రకటించిన హామీలను కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని.. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ కు గుర్తు చేస్తూ.. ప్రజల తరుపున పోరాటం చేయాలన్నారు. మోడీ-అదానీ ఒక్కటే అని రాహుల్‌ గాంధీ అంటున్నారు.. మొన్న రేవంత్‌రెడ్డి కూడా అదానీ, మోడీ ఒకటేనని విమర్శించారు.. ఎన్నికల ముందు అదానీ దొంగ అని రేవంత్ ఆరోపించారు.. అదే రేవంత్‌రెడ్డి దావోస్ సాక్షిగా అదానీతో అలయ్ బలయ్‌ చేసుకున్నారు.. కాంగ్రెస్ అవకాశవాదం, దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఢిల్లీలో అదానీతో కొట్లాడుతూ తెలంగాణలో మాత్రం అదానీతో కలిసి ఎందుకు పని చేస్తున్నారో కాంగ్రెస్ నేతలు ప్రజలకు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.