మహిళా వర్కర్‌తో కలిసి ఫ్లై ఓవర్ ప్రారంభించిన కేటీఆర్

మహిళా వర్కర్‌తో కలిసి ఫ్లై ఓవర్ ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాద్ బాలానగర్ చౌరస్తాలో నిర్మించిన ఆరు లైన్ల ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో కేటీఆర్‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. కూకట్ పల్లి వై జంక్షన్ నుంచి మేడ్చల్ హైవేకు తక్కువ సమయంలో చేరుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. బాలా‌నగర్ చౌరస్తాలో ఉన్న ట్రాఫిక్ సమస్యకు ఈ ఫ్లై ఓవర్ చెక్ పెట్టనుంది. ఈ ఫ్లై ఓవర్ వల్ల బాలానగర్ జంక్షన్ నుంచి జీడిమెట్ల, కూకట్ పల్లి, బోయిన్ పల్లి, సనత్ నగర్ ప్రాంతాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి. వ్యూహాత్మక రహదారుల అభివృద్ది పథకంలో భాగంగా రూ. 387 కోట్ల ఖర్చుతో హెచ్ఎండీఏ ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించింది. కూకట్‌పల్లి వై జంక్షన్ నుంచి బోయిన్‌పల్లి మార్గంలో 6 లైన్లతో ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు.

బాబు జ‌గ్జీవ‌న్ రామ్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు కేటీఆర్ ఘ‌న నివాళుల‌ర్పించారు. అనంతరం బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్‌కు బాబు జ‌గ్జీవ‌న్ రామ్ ఫ్లై ఓవ‌ర్‌గా నామ‌క‌ర‌ణం చేస్తున్న‌ట్లు ఆయన ప్రకటించారు. కాగా.. ఫ్లై ఓవర్ రిబ్బన్ కటింగ్‌ను అక్కడే ఉన్న కన్‌స్ట్రక్షన్ వర్కర్ శివమ్మతో చేయించి అందరి దృష్టిని ఆకర్షించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... ‘బాలానగర్‌ ఫ్లై ఓవర్‌కు జగ్జీవన్‌రామ్‌ వంతెనగా పేరు నిర్ణయిస్తున్నాం. దుర్భరమైన ట్రాఫిక్‌ కష్టాలు ఉండే ప్రాంతాల్లో బాలానగర్ ఒకటి. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా నగరంలో ఇప్పటికే వంతెనలు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన ఫ్లైఓవర్లు కూడా త్వరగా పూర్తి చేస్తాం. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే రెండు స్కైవేలు సాధ్యం కావడం లేదు. వంతెనల కోసం అవసరమైన భూములను కేంద్రం ఇవ్వటం లేదు. ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవేలు నిర్మిస్తాం’ అని కేటీఆర్‌ అన్నారు.