తెలంగాణ పోరాటం స్థాయిలో జల ఉద్యమం..రాష్ట్ర సాగునీటి హక్కులను కాపాడుకుంటం: కేటీఆర్

తెలంగాణ పోరాటం స్థాయిలో జల ఉద్యమం..రాష్ట్ర సాగునీటి హక్కులను కాపాడుకుంటం: కేటీఆర్
  •     యాగాలు చేయడం తప్పుకాదు.. 
  •     ప్రభుత్వం చేయాల్సిన పనులేవీ చేయట్లే​
  •     గోదావరి బోర్డు ఎజెండాపై ప్రభుత్వ వైఖరి చెప్పాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర నీటి హక్కుల్ని కొల్లగొట్టే ప్రయత్నం ఎవరు చేసినా కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ తెలంగాణ పోరాటం స్థాయిలో ఉద్యమిస్తామని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ హెచ్చరించారు. రైతుల నోటికాడి ముద్ద లాక్కుంటామంటే ఊరుకునేది లేదన్నారు. యాగాలు చేయడం తప్పు కాదని.. కానీ, ప్రభుత్వం చేయాల్సిన పని చేయాలన్నారు. శనివారం నందినగర్​లోని తన ఇంట్లో మీడియాతో కేటీఆర్​చిట్​చాట్​చేశారు. వ్యవసాయం, రైతుల పట్ల సీఎంకు పట్టింపుగానీ, అవగాహనగానీ లేదని విమర్శించారు. 

పాలమూరు బిడ్డను అని చెప్పుకునే రేవంత్ రెడ్డి.. పాలమూరుకు సాగునీరు ఇచ్చే సోయి కూడా లేదన్నారు. గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టుల అనుమతుల విషయంలో హరీశ్ రావు మాట్లాడినా ప్రభుత్వంలో చలనం లేదని, గోదావరి బోర్డు సమావేశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని, సమావేశానికి వెళ్తారా? లేదా చెప్పాలని కేటీఆర్ డిమాండ్​ చేశారు.  ఎజెండాను ఒప్పుకున్నారా? లేదా? అన్న విషయాన్ని సీఎం, మంత్రి ఉత్తమ్ స్పష్టం చేయాలన్నారు. ఎజెండాను వ్యతిరేకించాలని, సమావేశాన్నైనా బహిష్కరించాలని డిమాండ్​ చేశారు. 

కరెంటు 14 గంటలు కూడా ఇవ్వట్లే..

రాష్ట్రంలో 24 గంటల కరెంట్​ రావడం లేదని, 14 గంటలు కూడా ఇవ్వడంలేదని ఎస్​ఈలే అధికారికంగా చెప్తున్నారని కేటీఆర్​ ఆరోపించారు. హైదరాబాద్ లో కూడా చాలా సార్లు కరెంట్ పోతోందన్నారు. నీళ్లున్నా ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ నీరు తీసుకుంటున్నా సోయి లేదన్నారు. ప్రభుత్వం భేషజాలకు పోయి నీటిని లిఫ్ట్​ చేయట్లేదన్నారు. క్షుద్రపూజలంటూ కాంగ్రెస్​ క్షుద్ర, సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తోందన్నారు. హరీశ్ రావు గుడికి పోతే కాంగ్రెసోళ్లు క్షుద్రపూజలంటూ చిల్లరగా మాట్లాడుతున్నారన్నారు. 

హైడ్రాతో పేదల కడుపు కొడ్తున్నరు

బీఆర్​ఎస్​ హయాంలో ఎంతో మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చామని.. హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పట్టా అయిన ఇచ్చిందా? అని  కేటీఆర్ నిలదీశారు. పేదల ఇండ్లు కూల్చి స్వాధీనం చేసుకున్న స్థలాలను వేలం వేసి పెద్దలకు వేలం వేస్తున్నారని, హిట్లర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని హెచ్చరించారు. 22ఏ నిషేధిత జాబితా భూముల విషయంలో త్వరలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమం తీసుకుంటామన్నారు. కొంగర కలాన్ లో వంద ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారని, త్వరలోనే ఆ వివరాలన్నీ బయటపెడతామని చెప్పారు. హిల్ట్​ పాలసీ విషయంలో సెప్టెంబర్​లో కార్యక్రమం చేపడతామన్నారు.