- మున్సిపల్ ఎన్నికల కోసం రెండు రోజుల్లో జిల్లాలవారీగా ఇన్‌చార్జ్‌లు
- గెలుపే లక్ష్యంగా బస్తీబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌కు ఓటేస్తే జిల్లాల తొలగింపునకు ప్రజలు అనుమతి ఇచ్చినట్లేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని ప్రజలను ఆయన కోరారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. ఎన్నికల కోసం మున్సిపాలిటీల వారీగా పార్టీ ఇన్‌చార్జులను నియమిస్తామన్నారు. మరో రెండు రోజుల్లో ఇన్‌చార్జులను ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటికే జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు పూర్తయ్యాయని, ఎన్నికలకు పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని వెల్లడించారు.
స్థానిక నేతల ఆధ్వర్యంలోనే ఎన్నికల ప్రచారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తుందని తాము అనుకోవడం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటికే ‘బస్తీ బాట’ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి, గత పదేళ్లలో తాము చేసిన అభివృద్ధి పనులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిన పనులు, ప్రస్తుత సమస్యలను ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. ఇక ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో జంట నగరాల అస్తిత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సికింద్రాబాద్‌లో స్థానికులు చేస్తున్న ఉద్యమానికి జవాబు ఇవ్వాలన్నారు.
గ్రీన్ కోను కాపాడేందుకు బ్యాగులు తీసుకుంటున్నరా?
‘ఫార్ములా–ఈ’ విషయంలో గ్రీన్‌కోకు లబ్ధి చేకూర్చామంటూ ఆరోపణలు చేస్తున్నారని, అయితే అదే గ్రీన్ కోతో దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని కేటీఆర్ విమర్శించారు. గ్రీన్ కోను కాపాడేందుకు బ్యాగులు తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. దావోస్ లో ఏపీ బీజేపీ ఎంపీ సహా పలువురితో మంత్రులు చర్చలు జరుపుతున్నారని, ఇది దేనికి సంకేతమని నిలదీశారు.
ఒకవైపు ‘ఫార్ములా–ఈ’ కుంభకోణం అంటూనే.. దావోస్‌లో గ్రీన్ కోతో చర్చలు జరుపుతున్నారని మండిపడ్డారు. కాగా, సింగరేణి బొగ్గు స్కామ్‌ను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక స్కీములు మాయమై.. స్కాములు మిగిలాయని ఎద్దేవా చేశారు.సింగరేణి అంశమే కాంగ్రెస్ అసలు రూపాన్ని బయటపెడుతోందని పేర్కొన్నారు.
