
హైదరాబాద్, వెలుగు: పరిపాలనలో బిజీగా ఉండి పార్టీకి, కేడర్‌కు ఎక్కువగా టైమ్ ఇవ్వలేకపోయామని.. తెలంగాణను చక్కదిద్దడానికే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చిందని బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్అన్నారు. ఇక నుంచి కార్యకర్తలకు అండగా ఉంటామని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్లో నిజామాబాద్లోక్సభ సన్నద్ధత సమావేశంలో ఆయన మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులపై క్షేత్ర స్థాయిలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు చెప్తున్న అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని, ఇకపై అలాంటి పొరపాట్లు రిపీట్కానివ్వబోమని హామీ ఇచ్చారు. ప్రభుత్వ వ్యవహారాలు చక్కబెడుతూనే పార్టీకి కొంత టైమ్ ఇచ్చి ఉన్నా, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నా ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్న కార్యకర్తల అభిప్రాయల్లో నిజం ఉందన్నారు. గ్రామ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేస్తామని.. పార్టీ నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు.
దరఖాస్తుల పేరుతో ప్రజల్ని రోడ్లపై నిల్చొపెట్టింది
పేదల సంక్షేమం కోసం బీఆర్ఎస్ప్రభుత్వం ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ప్రభుత్వం రద్దు చేస్తోందని.. ప్రభుత్వం తీరును ఎండగడుదామని కేటీఆర్అన్నారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ పేదల కోసం చేసిందేమి లేదని, బీఆర్ఎస్ప్రభుత్వం ప్రారంభించిన దళితబంధు సహా చాలా పథకాల అమలును నిలిపివేసిందన్నారు. ఎన్నికల్లో గెలవడానికి 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌పార్టీ ఇప్పుడు కేవలం ఆరు గ్యారంటీల పేరుతో తప్పించుకోవాలని చూస్తోందన్నారు. బీఆర్ఎస్అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండానే సంక్షేమ పథకాలు అందజేశామని, కానీ ప్రజాపాలన పేరుతో ప్రజలందరినీ రోడ్లపై నిల్చోబెట్టి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందన్నారు.
గుజరాత్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది
బిల్కిస్‌బానో రేప్‌కేసులో నిందితులకు క్షమాభిక్ష పెట్టి గుజరాత్ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కేటీఆర్ ఆరోపించారు. ఈ క్షమాభిక్ష కేసులో తీర్పునిచ్చి బిల్కిస్బానోకు న్యాయం చేసిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన గుజరాత్ ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు.