కుంకుమ్ స్వర్ణ గురి

కుంకుమ్ స్వర్ణ గురి

నగోయా: ఏషియాడ్‌‌లో ఇండియా యంగ్‌‌ ఆర్చర్‌‌ కుంకుమ్‌‌ మోహద్‌‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. విమెన్స్‌‌ వ్యక్తిగత రికర్వ్‌‌ విభాగంలో తొలిసారి స్వర్ణం గెలిచిన కుంకుమ్‌‌ 2028 లాస్‌‌ ఏంజిల్స్‌‌ ఒలింపిక్‌‌ బెర్త్‌‌ను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో కుంకుమ్‌‌ 6-5 (షూటౌట్‌‌)తో ఓహ్‌‌ యెజిన్‌‌ (సౌత్‌‌ కొరియా)పై గెలిచింది. షూటౌట్‌‌లో ఇండియన్‌‌ ఆర్చర్‌‌ బాణాన్ని 10 పాయింట్ల రింగ్‌‌లోకి పంపి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.

ఫలితంగా ఏషియాడ్‌‌లో వ్యక్తిగత రికర్వ్‌‌ ఈవెంట్‌‌లో స్వర్ణం గెలిచిన తొలి ఇండియన్‌‌ విమెన్‌‌ ఆర్చర్‌‌గా కుంకుమ్‌‌ రికార్డులకెక్కింది. క్వార్టర్స్‌‌లో వరల్డ్‌‌ చాంపియన్‌‌ కాంగ్‌‌ చాయోంగ్‌‌ను, సెమీస్‌‌లో జింగీ జూను ఓడించి ఫైనల్‌‌కు చేరిన కుంకుమ్‌‌ అదే జోరును చూపెట్టింది. తొలి సెట్‌‌లో 8 స్కోరు చేసిన కుంకుమ్‌‌ రెండో సెట్‌‌లో స్కోరును సమం చేసింది.

అయితే మూడో సెట్​లో మూడు 10లతో సెట్‌‌ను సాధించింది. నాలుగో సెట్‌‌లో 8 స్కోరే రావడంతో కాస్త ఒత్తిడికి లోనైంది. ఐదో సెట్‌‌లో కుంకుమ్‌‌ మూడు 10 స్కోర్లు సాధించడంతో ఇద్దరు ఆర్చర్లు 5-5తో నిలిచారు. దాంతో ఇద్దరి మధ్య షుటౌట్‌‌ నిర్వహించగా, ఇందులో యోజిన్‌‌ 8, కుంకుమ్‌‌ 10 స్కోరు చేసింది.  మెన్స్‌‌ వ్యక్తిగత రికర్వ్‌‌ కాంస్య పతక పోరులో నీరజ్‌‌ చౌహాన్‌‌ 6-4తో ధీరజ్‌‌ బొమ్మదేవరపై గెలిచాడు.