- కుమ్రంభీమ్ త్యాగం భావితరాలకు స్ఫూర్తి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఆదివాసీ సంస్కృతి పరిరక్షణ అందరి బాధ్యత
- రౌటా సంకెపల్లిలో ‘గ్రామోత్సవ్’
- కుమ్రంభీమ్, ఎడ్లకొండల్ విగ్రహాల ఏర్పాటుకు భూమిపూజ
ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రం భీమ్ నినాదం జల్, జంగల్, జమీన్ అంటే కేవలం మూడు పదాలు కాదని.. ప్రకృతి, మనిషి సహజీవనానికి ప్రతీక అని గవర్నర్శివ ప్రతాప్ శుక్లా అన్నారు. ప్రకృతిని కాపాడే సమాజాన్ని.. ప్రకృతి కూడా కాపాడుతుందని ఆయన చెప్పారు. గొప్ప సైన్యం లేకపోయినా తమ హక్కులు, ఆత్మగౌరవం కోసం కుమ్రంభీమ్ ధైర్యసాహసాలతో పోరాడారని, ఆయన త్యాగం చిరస్మరణీయమన్నారు. ఆదివాసీ మహానేతల ఆలోచనలు, ఆదర్శాలను యువతకు చేర్చవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిమీద ఉందన్నారు.
ఆసిఫాబాద్ మండలం రౌట సంకేపల్లిలో శుక్రవారం నిర్వహించిన గ్రామోత్సవ్ వేడుకలకు గవర్నర్ ముఖ్య అతిథిగా వచ్చారు. హైదరాబాద్‌కు చెందిన నాగేంద్ర ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్కుమ్రంభీమ్, ఎడ్ల కొండల్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే, గ్రామంలో కుమ్రంభీమ్, ఎడ్లకొండల్ 20 అడుగుల కాంస్య విగ్రహాల నిర్మాణపనులకు భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా మద్యపానాన్ని నిషేధిస్తూ గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు. గ్రామోత్సవం ద్వారా గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, సామాజిక చైతన్యానికి పెద్దపీట వేశారని గవర్నర్పేర్కొన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించి.. విద్య, గౌరవం పొందేలా, స్వావలంబన సాధించేలా చూడాలన్నారు. యువత తమ మూలాలను, సంస్కృతిని మరవకూడదని, క్రమశిక్షణ, కఠోర శ్రమతోనే విజయం సాధించగలరని చెప్పారు.
చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో సమాజ భాగస్వామ్యం కూడా ఉండాలన్నారు. రౌటా సంకెపల్లి గ్రామం భవిష్యత్తులో ఆదర్శ ఆదివాసీ గ్రామంగా.. అభివృద్ధి, సామాజిక చైతన్యానికి కేంద్రంగా నిలుస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ గిరిజన కుటుంబాలకు సోలార్ పానెళ్లను పంపిణీ చేశారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న దాత నాగేంద్రను ఆయన శాలువాతో సత్కరించారు.
గిరిజన భూములను గిరిజనేతరులు తీసుకోకుండా చూడాలి: దత్తాత్రేయ
గిరిజన భూములను ఎవరైనా తీసుకుంటే కఠన చర్యలు తీసుకోవాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. కుమ్రం భీమ్ ఆత్మ గౌరవ పోరాటానికి పునాది వేశారని, జల్ జంగల్ జమీన్ కోసం నిజాం నిరంకుశ పాలన పై తిరగబడ్డారని అన్నారు. ఈ స్పెషల్ సెక్రటరీ ఎం. దాన కిషోర్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, కాటిపల్లి వెంకటరమణా రెడ్డి, వెడ్మ బొజ్జు పటేల్, హరీశ్ బాబు, కలెక్టర్ కె. హరిత, ఎస్పీ నితికా పంత్, నిర్వాహకులు రాయపూడి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి..
ప్రజల ఆరోగ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, రోగులకు మెరుగైన సేవలు అందించాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో రివ్యూ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో 464 మంది క్షయ రోగులున్నారని, జిల్లా అధికారులు వారిలో ఒక్కొక్కరిని దత్తత తీసుకొని మందులు, పౌష్టికాహారం అందించాలన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. జిల్లా అభివృద్ధి కోసం సమన్వయంతో పని చేయాలన్నారు. అంతకుముందు హెలిపాడ్ వద్ద గవర్నర్ కు కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులు స్వాగతం పలికారు.
