పీసీసీ చీఫ్ నియామకంలో మార్పు లేదు : కుంతియా

పీసీసీ చీఫ్ నియామకంలో మార్పు లేదు : కుంతియా

హైదరాబాద్ : రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరారు రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్, ఏఐసీసీ నాయకుడు రామచంద్ర కుంతియా. హైదరాబాద్ గాంధీభవన్ లో పార్టీ మీటింగ్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ మంచి ఫైటర్ అని మొన్నటి ఎన్నికల్లో తేలిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 34 శాతానికి పెంచాలన్నారు. 29న రాష్ట్ర కార్యవర్గ సమావేశం నాగార్జున సాగర్ లో జరుపుతామన్నారు.

మున్సిపల్ ఎన్నికల వ్యూహరచన కోసం పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీ వేశాం. ప్రతీ నెల 1,2,3 తేదీల్లో మండల జిల్లా, బ్లాక్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తాం. జులై మొదటివారంలో MPTC, ZPTCల సమావేశం నిర్వహిస్తాం. పార్టీ ఓటమిపై క్షేత్ర స్థాయి నివేదికలు తెప్పించుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. కాంగ్రెస్ కార్యకర్తలు కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషిచేయాలి” అన్నారు.

“కొత్త అధ్యక్షుని నియామకంపై ఎలాంటి చర్చ జరగలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డినే పీసీసీ చీఫ్ గా కొనసాగుతారు.  రాజగోపాల్ రెడ్డికి పార్టీ చాలా గౌరవం ఇచ్చింది. కానీ ఆయన ఎందుకు అలా చేస్తున్నారో తెలియడం లేదు. అతని మీద క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుంది. ఎవరు క్రమశిక్షణ తప్పినా ఉపేక్షించేది లేదు. టికెట్లకోసం వచ్చినప్పుడు నాయకత్వం బలహీనంగా ఉందన్న విషయం పార్టీ మారిన నేతలకు తెలియదా?” అని ప్రశ్నించారు కుంతియా.