టెహ్రాన్: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. అమెరికా దాడులకు ధీటుగా ఇరాన్ ప్రతీదాడులు చేస్తోంది. ఇందులో భాగంగానే అమెరికా మిత్ర దేశమైన కువైట్‌పై ఇరాన్ మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. బుధవారం (జూన్ 3) కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ అటాక్ చేసింది. ఈ దాడిలో పలువురు గాయపడగా.. విమానాశ్రయం దెబ్బతిన్నది. ఇరాన్ దాడుల నేపథ్యంలో అధికారులు ఎయిర్ పోర్టును క్లోజ్ చేసి విమాన రాకపోకలను నిలిపివేశారు.
ఈ దాడిపై కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రయాణికుల టెర్మినల్‌ను పలు శత్రు డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయని.. ఈ దాడిలో భవనానికి తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు పలువురు గాయపడ్డారని తెలిపింది. కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ సౌద్ అబ్దుల్ అజీజ్ అల్-ఒతైబి మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్ డ్రోన్‌లు విమానాశ్రయంలోని ప్రయాణీకుల టెర్మినళ్లపై దాడులు చేశాయని తెలిపారు. ఘటన స్థలంలో అత్యవసర బృందాలను మోహరించామని చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా ఎయిర్ పోర్టును క్లోజ్ చేసి ఫ్లయిట్ సర్వీసులను నిలిపివేసినట్లు తెలిపారు.
ఇరాన్‌లోని ఖేష్మ్ ద్వీపంపై ఇటీవల అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ రివేంజ్ అటాక్స్కు దిగింది. కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మెరుపు దాడులు చేసింది. మిస్సైళ్లు, బాంబులతో విరుచుకుపడింది.
ఇరాన్ దాడులతో అమెరికా సైన్యం అప్రమత్తమైంది. ఇరాన్ మిస్సైళ్లు, బాంబులను గాల్లోనే అడ్డుకుని పేల్చేశాయి అమెరికా దళాలు. ఈ దాడుల వల్ల పెద్దగా నష్టం జరగలేదని అమెరికా, కువైట్ దేశాలు తెలిపాయి. తమ వాయు రక్షణ వ్యవస్థలు ఇరాన్ క్షిపణులను, డ్రోన్‌లను అడ్డుకున్నాయని కువైట్ సైన్యం పేర్కొంది.
►ALSO READ | భారత్‌కు మరోసారి అమెరికా షాక్?.. కొత్త సుంకాల విధింపుకు ప్రతిపాదన!
ఇరాన్ క్షిపణుల్లో ఏ ఒక్కటీ తమ లక్ష్యాలను చేరలేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) తెలిపింది. ఈ ఘటనలో ఏ అమెరికా సిబ్బంది గాయపడలేదని, ఎలాంటి సైనిక ఆస్తులకు నష్టం జరగలేదని సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కువైట్, బహ్రెయిన్ ప్రభుత్వాలు ప్రజలకు సూచించారు. ముందుజాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు.
దాడులు మేం చేశాం: ఇరాన్
కువైట్, బహ్రెయిన్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన క్షిపణి దాడులకు తామే బాధ్యులమని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. ఇరాన్‌లోని ఖేష్మ్ ద్వీపంపై ఇటీవల అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు జరిపినట్లు పేర్కొంది. ఇరాన్ ఎయిర్ ఫోర్స్ అమెరికా సైనిక స్థావరాలపై ఖచ్చితమైన క్షిపణి దాడులు జరిపినట్లు తెలిపింది.
ఇరాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నా.. దానికి మరింత బలమైన ప్రతిస్పందన ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. హిట్ అండ్ రన్ శకం ముగిసిందని.. దురాక్రమణ శక్తులు తమ దుస్సాహసాలకు తీవ్ర పరిణామాలను భరించాలని వార్నింగ్ ఇచ్చింది. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియా మళ్లీ రణరంగాన్ని తలపిస్తోంది. తాజా దాడులతో అమెరికా-ఇరాన్ మధ్య చివరి దశకు చేరుకున్న పీస్ టాక్స్ నిలిచిపోయాయి.
