ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 100 రాఫెల్ జెట్స్: ఫ్రాన్స్, ఉక్రెయిన్ మధ్య భారీ డీల్

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 100 రాఫెల్ జెట్స్: ఫ్రాన్స్, ఉక్రెయిన్ మధ్య భారీ డీల్

పారిస్: ఫ్రాన్స్, ఉక్రెయిన్ మధ్య భారీ రక్షణ ఒప్పందం కుదిరింది. ఫ్రాన్స్ నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు ఉక్రెయిన్ ఒప్పందం చేసుకుంది. ఈ అగ్రిమెంట్‎పై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్ స్కీ సంతకాలు చేశారు. జెలెన్ స్కీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఈ డీల్ కుదిరింది. రష్యా దాడుల కొనసాగుతున్న వేళ తమ వైమానిక రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికి ఉక్రెయిన్ ఈ భారీ ఒప్పందం కుదుర్చుకుంది.

ఉక్రెయిన్ రాయబార కార్యాలయం, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఆఫీస్ ఈ ఒప్పందాన్ని ధృవీకరించాయి. డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసే రాఫెల్ జెట్‌లతో సహా అధునాతన ఫ్రెంచ్ రక్షణ పరికరాలను కొనుగోలు చేయడానికి కీవ్ అన్వేషిస్తోందని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం పేర్కొంది. అయితే.. ఈ ఒప్పందానికి సంబంధించిన నగదు విలువ, విమానాల డెలివరీ డేట్‎లకు సంబంధించిన వివరాలను మాత్రం ఇరుదేశాలు వెల్లడించలేదు. 

ఫ్రాన్స్‎కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ తయారు చేస్తోన్న రాఫైల్ ఫైటర్ జెట్స్ ఎంతో పవర్ ఫుల్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాఫైల్ రంగంలోకి దిగిందంటే వార్ వన్ సైడే. పహల్గాం టెర్రర్ ఎటాక్‎కు ప్రతీకారంగా ఇండియా చేపట్టిన ఆపరేషన్ సిందూరే ఇందుకు నిదర్శనం. ఆపరేషన్ సిందూర్‏లో రాఫెల్ యుద్ధ విమానాలే కీలకంగా వ్యవహరించాయి.

పీవోకేతో పాటు పాకిస్తాన్‎లోని ఉగ్ర స్థావరాలపై బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపించి ఎక్కడికక్కడ నేలమట్టం చేశాయి రాఫెల్ ఫైటర్ జెట్స్. రాఫెల్ దెబ్బకు పాక్ కకావికలమైంది. ఇలాంటిది.. రష్యాతో సుదీర్ఘ కాలంగా యుద్ధం చేస్తోన్న ఉక్రెయిన్ ఏకంగా 100 రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు ఒప్పందం చేసుకోవడం ప్రపంచ దేశాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.