- ఓనర్లకు పని గంటలు పెంచుకునే చాన్స్ ఇచ్చారు: అమర్ జీత్ కౌర్
- చట్టాలను కుదించడం సంస్కరణలు కాదన్న
- ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ
హైదరాబాద్, వెలుగు: దశాబ్దాల పోరాట ఫలితంగా సాధించిన 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి, యాజమాన్యాలకు పని గంటలు పెంచుకునే అవకాశం కల్పించడం కార్మికులను మళ్లీ బానిసత్వంలోకి నెట్టడమేనని ఏఐటీయూసీ నేషనల్ జనరల్ సెక్రటరీ అమర్ జీత్ కౌర్ విమర్శించారు. ‘వేతనం’ అనే పదానికి కొత్త నిర్వచనం ఇవ్వడం ద్వారా కార్మికుల అలవెన్సులు తగ్గిపోతాయని, దీని ప్రభావం పీఎఫ్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ ప్రయోజనాలపై పడ్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ కొండాపూర్ సీఆర్ ఫౌండేషన్‌లో గురువారం “ కొత్త లేబర్ కోడ్ లు, కార్మికవర్గంపై వాటి ప్రభావం” అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో అమర్ జీత్ కౌర్ చీఫ్ గెస్ట్‌గా పాల్గొని మాట్లాడారు. ‘‘కొత్త కొత్త నిబంధనలతో కార్మిక యూనియన్లను నాశనం చేస్తున్నారు.
చట్టాలను కార్పొరేట్ ప్రయోజనాల కోసం కేంద్రం కుదించింది. ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సామాజిక భద్రతా పథకాల పరిధిని తగ్గించడంతో కార్మికుల భవిష్యత్తు అంధకారమవుతుంది. కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటిని కేవలం 4 కోడ్లుగా మార్చడం సంస్కరణ కాదు. ఇది కార్మిక హక్కులపై ప్రత్యక్ష దాడి’’అని ఆమె విమర్శించారు.
జర్నలిస్టులకు రక్షణ లేదు: శ్రీనివాస రెడ్డి
గతంలో జర్నలిస్టులకు రక్షణగా ఉన్న ‘వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్’ను రద్దు చేసి, దాన్ని ఇతర కార్మిక చట్టాలతో కలిపి ‘ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్’కోడ్ లో చేర్చడంతో జర్నలిస్టుల ప్రత్యేక గుర్తింపు, రక్షణ పోతున్నదని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి అన్నారు. ‘‘వేజ్ బోర్డుల వ్యవస్థ దెబ్బతింటే యాజమాన్యాల దయాదాక్షిణ్యాలపై జర్నలిస్టులు ఆధారపడాల్సి వస్తున్నది. ఉద్యోగ భద్రత లేకుండా మీడియా స్వేచ్ఛ నిలబడదు. కొత్త చట్టాలు ప్రధానంగా కార్పొరేట్ సంస్థలకు, యజమానులకు అనుకూలంగా ఉన్నాయి. పని గంటలు పెరగడం, ఉద్యోగ భద్రత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి’’అని ఆయన అన్నారు. లేబర్ కోడ్ లు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది.
