హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. డాక్టర్ సంజీవరెడ్డి, మొగుళ్ల రాజిరెడ్డి ఆధ్వర్యంలోని వివిధ కార్మిక సంఘాల నేతలు ఆదివారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, యాజమాన్యం ముందు పలు కీలక డిమాండ్లను ఉంచారు. అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింటెడ్ డేట్‌ను తక్షణమే ప్రకటించాలని కోరారు.
2021, 2025 సంవత్సరాలకు సంబంధించిన వేతన సవరణలను (పీఆర్సీ) అమలు చేయాలన్నారు. సంస్థలో కార్మిక సంఘాలను పునరుద్ధరించి వెంటనే యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. 2017 ఏరియర్స్, 2019 సమ్మె కాలం నాటి పోలీస్ కేసుల ఎత్తివేత, రిటైర్డ్ ఉద్యోగుల పీఎఫ్, సీసీఎస్ బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మహాలక్ష్మి పథకానికి సంబంధించి రావాల్సిన రూ.400 కోట్ల రీయింబర్స్‌మెంట్‌ను ప్రతినెలా క్రమం తప్పకుండా విడుదల చేయాలన్నారు.
కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి పారిశ్రామిక శాంతిని నెలకొల్పాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో అశ్వథ్దామరెడ్డి (టీఎంయూ), జక్కుల మల్లేశ్ గౌడ్ (ఎస్‌డబ్ల్యూయూ), హన్మంతు ముదిరాజ్ (టీజేఎంయూ), నరేందర్ (ఎన్ఎంయూ), వెంకటేశ్వర్లు (బీఆర్టీయూ), హరికిషన్ (ఎస్ టీఎంయూ), స్వామికుమార్ (బీఎంఎస్) ఉన్నారు.

