తగ్గుతున్న డెలివరీలు

తగ్గుతున్న డెలివరీలు

కరీంనగర్, వెలుగు : పీహెచ్‍సీల్లోనే ప్రసవాలు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఎక్కడా అమలు కావడం లేదు. 24 గంటలు సేవలందించే పీహెచ్​సీ ( ప్రైమరీ హెల్త్​ సెంటర్​)లలో సగటున నెలకు 20  డెలివరీలైనా చేయాల్సి ఉండగా కనీసం రెండు మూడు కూడా కావడం లేదు. డాక్టర్లు లేకపోవడంతో అంతో ఇంతో వైద్యం తెలిసిన స్టాఫ్ నర్సులే భయపడుకుంటూ నార్మల్​ డెలివరీలు చేస్తున్నారు. దీంతో రూరల్ ఏరియాల్లోని పీహెచ్ సీల్లో లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన లేబర్ రూమ్, ఇతర ఎక్విప్​మెంట్ ​వృథాగా పడి ఉంటోంది. మరికొన్ని చోట్ల ఆ ఫెసిలిటీస్​ కూడా లేవు.  

 సౌకర్యాలూ అంతంతే.. 
జిల్లా కేంద్రాల్లో ఉన్న దవాఖానాలపై ఒత్తిడి తగ్గిం చేందుకు మూడేండ్ల కింద నేషనల్‍ రూరల్‍ హెల్త్ మిషన్‍ ఫండ్స్​ కేటాయించింది. ఒక్కో పీహెచ్‍సీకీ కనీసం రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు ఇచ్చింది. వీటితో సర్కారు పీహెచ్‍సీలను ఆధునీకరించాల్సి ఉన్నా అన్ని చోట్లా ఫెసిలిటీస్​ కల్పించలేదు. నిర్లక్ష్యం వహించడంతో సిజేరియన్​ చేయడానికి వీలుకాక వేరే హాస్పిటల్స్​కు పంపిస్తున్నారు.  

డిప్యుటేషన్లపై డాక్టర్లు 
ఇంతకుముందు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్ సీల్లో డాక్టర్లు, స్పెషలిస్టులు అందుబాటులో ఉండేవారు. కానీ వీరిని జిల్లా కేంద్రాల్లోని దవాఖానాలకు, సిటీలోని మెడికల్ కాలేజీలకు డిప్యూటేషన్ల మీద పంపిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీలలో వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 100 మందికిపైగా డాక్టర్లు పీజీ సీట్లు వచ్చి వెళ్లిపోగా, 300 మందిని మెడికల్​ కాలేజీలకు ట్రాన్స్​ఫర్​ చేశారు. దీంతో పీహెచ్​సీలకు వస్తున్న గర్భిణులు అక్కడి నుంచి వేరే హాస్పిటల్స్ కు వెళ్లిపోతున్నారు. 

మీటింగ్స్​ఏవి? 
గతంలో పీహెచ్​సీల్లో ప్రసవాలు, సిబ్బంది పనితీరుపై కలెక్టర్‍ రివ్యూలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఇలాంటి మీటింగ్స్​జరగడం లేదు. ఎప్పుడోసారి నిర్వహించినా డెలివరీల ఇష్యూను సీరియస్​గా తీసుకోవడం లేదు. ప్రతి జిల్లాలో కొంతమంది స్టాఫ్​నర్సులకు డెలివరీలు చేయడానికి ట్రైనింగ్​ ఇప్పించినా వీరిని ఉపయోగించుకోవడం లేదు. 

ఎక్కడెక్కడ ఎన్ని డెలివరీలు చేశారంటే... 
     ఒక్క పీహెచ్​సీలో నెలకు 20 చొప్పున సాధారణ కాన్పులు చేయాల్సి ఉండగా కరీంనగర్ జిల్లాలోని పీహెచ్‍సీల్లో 2021లో 51 నార్మల్ ​డెలివరీలు మాత్రమే చేశారు.  ఐదుగురికి సిజేరియన్‍  జరిగింది. వీటిలో ఎక్కువగా చొప్పదండిలోనే 25 డెలివరీలు చేశారు. 24 గంటలు పని చేసే వెల్దిలో ఐదు, గుండిలో 10, గంగాధరలో 9, చల్లూరులో ఒకటి , వావిలాలలో రెండు  చొప్పున డెలివరీలు జరిగాయి. 
     జగిత్యాల జిల్లాలోని17 పీహెచ్​సీలకు గాను 15 సెంటర్లలో మాత్రమే డెలివరీలు చేస్తున్నారు. 2021లో మొత్తంగా 185 ప్రసవాలు చేశారు. కొవిడ్​ను కారణంగా చూపుతూ జిల్లా దవాఖానాకు, మెట్​పల్లి, కోరుట్ల ఏరియా దవాఖానాలకు రెఫర్ ​చేస్తున్నారు. ఇక్కడ ఫెసిలిటీస్​లేకపోవడం, డాక్టర్స్, సిబ్బంది కొరతతో డెలివరీల సంఖ్య తగ్గింది.
  పెద్దపల్లి జిల్లాలోని 16 పీహెచ్​సీలలో 2021 జనవరి నుంచి 2022 జనవరి 31 వరకు 110  డెలివరీలు చేశారు. 
    సూర్యాపేట జిల్లాలో 23 పీహెచ్​సీలలో కేవలం 19 కేంద్రాల్లో మాత్రమే కాన్పులు చేస్తున్నారు. సిబ్బంది కొరత, డాక్టర్లు అందుబాటులో ఉండకపోవడం, ఉన్న డాక్టర్లకు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండడంతో బయటకు రెఫర్​ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.  
    ఆదిలాబాద్ జిల్లాలో 22 పీహెచ్‍సీలుండగా, 18 పీహెచ్‍సీల్లోనే డెలివరీలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న మండలాల్లోని పీహెచ్​సీల్లో డెలివరీలు చేయడం ఆపేశారు.  
    నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పీహెచ్​సీలో ఆపరేషన్ థియేటర్ లేకపోవడంతో డెలివరీలు చేయడం లేదు. ఇక్కడికి వచ్చే గర్భిణులను నర్సాపూర్ 30 పడకల హాస్పిటల్​కు పంపిస్తున్నారు. జిల్లాలోని 18 పీహెచ్​సీల్లో గత ఏడాదిలో 377 డెలివరీలు మాత్రమే జరిగాయి. 
     సిద్దిపేట జిల్లాలోని 33 పీహెచ్​సీల్లో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి నెలాఖరు వరకు 289 డెలివరీలు జరిగాయి. ఇక్కడ నార్మల్ డెలివరీలు మాత్రమే చేస్తున్నారు. సిజేరియన్లు  చేయడం ఎప్పుడో బంద్​ చేశారు.  
    మహబూబాబాద్ జిల్లా లో 24 గంటల పాటు పని చేసే పీహెచ్‍సీలు 10  ఉండగా  బలపాల పీహెచ్ సీ లో ఆరే  ప్రసవాలు జరిగాయి.  
    హనుమకొండ జిల్లాలోని పీహెచ్ సీల్లో  2021లో  131 డెలివరీలు మాత్రమే చేశారు.  
 నాగర్ కర్నూలు జిల్లాలో ఈ ఏడాది ఫిబ్రవరి 22 వరకు 531 కాన్పులు మాత్రమే జరిగాయి. -ఉప్పునుంతల పీహెచ్​సీ లో ఒక్క డెలివరీ కూడా చేయలేదు. ఊర్కొండ, చారకొండ, తోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ  ఇదే పరిస్థితి నెలకొంది. ప్రసవానికి వచ్చిన గర్భిణులను కమ్యూనిటీ హాస్పిటల్,  జిల్లా హాస్పిటల్ కు రెఫర్ చేస్తున్నారు. రఘుపతి పేటలో ఒకటి, వంగూర్ లో రెండు,వెల్దండలో నాలుగు  డెలివరీలు మాత్రమే చేయగలిగారు.