నేర చరిత్రులకు నోటాతో చెక్​

నేర చరిత్రులకు నోటాతో చెక్​

 బ్రిటిష్‌‌‌‌ వారి హయాంలో  దేశంలో 1919లో  మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించారు. అయితే ఓటుహక్కు కేవలం మగవారికి, ముఖ్యంగా ఆస్తిపాస్తులు ఉన్నవారికి మాత్రమే పరిమితమైంది. 1930లో దేశంలోని అన్ని సంస్థానాలలో మొదటిసారిగా మహిళలకు ఓటు హక్కు ఇవ్వడమైంది. 1947లో  దేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికి 20% మంది పురుషులు, 10% మంది మహిళలు మాత్రమే చదువుకున్నవారు ఉన్నా.. భారత రాజ్యాంగం అందరికీ ఓటుహక్కు కల్పించింది.

 స్వాతంత్ర్య భారతావనిలో  మొదటి ఎన్నికలు అక్టోబరు 25,  1951 నుంచి ఫిబ్రవరి 21, 1952 వరకు జరిగాయి. అప్పుడు 17.3 కోట్ల ఓటర్లుగా నమోదు చేయడమైనది. వీరిలో 10.6 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే సుమారు 61% పోలింగ్​ నమోదైంది. 1950 , 60వ  దశకంలో ఎన్నికల బరిలో నిలచిన అభ్యర్థులందరూ స్వాతంత్ర్య సమర యోధులే, నేరచరిత్రులకు ఏ పార్టీ కూడా టికెట్‌‌‌‌ ఇవ్వలేదు. 

ఎన్నికలలో 70వ దశకం నుంచి ధనవంతులు గెలవడానికి స్టానికంగా ఉన్న రౌడీ మూకల సహాయం తీసుకోవడం మొదలైంది. ముంబయి వంటి మహా నగరాలలో గ్యాంగ్‌‌‌‌స్టర్ల  సహాయంతో ఎన్నికలలో గెలిచేవారు. ఇక ఈ రౌడీ మూకలు చేసే అరాచకాలకు రాజకీయ నాయకులు కొమ్ముకాచేవారు. అనంతరం నేరచరిత్రులు,  భూకబ్టాదారులు ఎన్నికలలో నిలబడి గెలవడం జరుగుతోంది. రాజకీయపార్టీలు అభ్యర్థుల చరిత్ర చూడకుండా గెలుపు గుర్రాల వేటలో గూండాలు, భూకబ్జాదారులు, ధనబలం ఉన్నవారికి టికెట్​ ఇవ్వడం పరిపాటి అయిపోయింది.  ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో కానీ,  దేశ పార్లమెంటులో అయితేనేమి సుమారు 40% మంది గౌరవ సభ్యులు నేరచరిత్ర కలిగినవారే ఉన్నారు.

నోటాకు ప్రాధాన్యమివ్వాలి

ఎన్నికలలో ఓటు వేయాలి. కానీ, బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరూ సమ్మతం కాదన్న సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం ఓటరుకు ఒక ప్రత్యేకమైన వీలు కల్పించింది. అంటే, ఓటరు పోలింగు స్టేషన్‌‌‌‌కు వెళ్ళి పోలింగు అధికారి నుంచి బ్యాలెట్‌‌‌‌ పేపర్‌‌‌‌ తీసుకొని ఎవరికీ ఓటు వేయనని రాసిన బ్యాలెట్‌‌‌‌ పేపర్‌‌‌‌ ను  ప్రిసైడింగ్‌‌‌‌ అధికారి ఒక రిజిస్టర్‌‌‌‌లో నమోదు చేసుకుంటాడు. ఈ ప్రక్రియలో ఓటరు గోప్యత ఉండదు. ఈ విషయంపై సుప్రీం కోర్టు  సూచనతో 2013లో నోటాను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే, ఇది కేవలం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులపై ఓటరు తన అనాసక్తి చూపించడానికి మాత్రమే పనికి వస్తుంది.

అదీకాక నోటాకు పెద్ద మొత్తంలో ఓట్లు పడితే రాజకీయ పార్టీలు ఇకముందు మంచివారికి టికెట్‌‌‌‌ ఇవ్వడానికి ఈ ప్రక్రియ దోహదపడవచ్చు. అలాగే ఎన్నికల ఫలితాలలో తిరస్కార ఓటు స్పష్టంగా కనిపిస్తుంది.  గత రెండు, మూడు ఎన్నికలలో నోటాకు పోలైన ఓట్లలో 1.5%కి మించిరాలేదు.  ప్రస్తుత పరిస్థితులలో ఎన్నికల సంస్కరణలలో నోటా పాత్ర పెద్దగా లేదు.

ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే సుప్రీంకోర్టు  ప్రవేశపెట్టిన నోటా వెసులుబాటు ఎన్నికల ప్రక్రియపై పోలింగు శాతం పెంచడానికిగానీ, అలాగే రాజకీయ నాయకుల గెలుపు గుర్రాల ఎంపికపై  ఎటువంటి ప్రభావం చూపడంలేదు. ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో వంద ఓట్టు పోలై అందులో నోటాకు 90 ఓట్లు , ఇంకో అభ్యర్థికి 10 ఓట్లు వస్తే  10 ఓట్టు పొందిన అభ్యర్థి  గెలిచినట్టు అవుతుంది. ఈ నేపథ్యంలో నోటాకు పదును పెట్టి దానిని సరియైన పద్ధతిలో అమలు చేయాల్సిన అవసరముంది.  రాజ్యాంగంలోని 324 అధికరణ ఆధారంగా తీసుకొని హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌‌‌‌..పంచాయతీ ఎన్నికలలో నోటాను సరియైన పద్ధతిలో అమలు చేస్తున్నారు. 

నోటాకు అధికంగా ఓట్లు వస్తే రీపోల్​ నోటాను ఒక  కల్పిత అభ్యర్థిగా గుర్తించడం.  ఒకవేళ నోటా (కల్పిత అభ్యర్థి) అలాగే బరిలో ఉన్న అభ్యర్థికి సమాన ఓట్టు వచ్చినా, బరిలో ఉన్న వ్యక్తి గెలిచినట్టుగా ప్రకటిస్తారు. ఒకవేళ పోటీలోని అభ్యర్జుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినా, ఆ ఎన్నిక రద్దు చేసి మరల ఎన్నికలు జరిపిస్తారు. అదేకాకుండా ఆ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు  ఎవరూ కూడా రీపోల్‌‌‌‌లో  పోటీ చేయడానికి వీలులేదు.

ఈ పద్ధతిని తెలంగాణలో రాబోయే పంచాయతీ ఎన్నికలలో అమలుచేస్తే  బాగుంటుంది. చాలా  గ్రామ పంచాయతీలలో  గ్రామాభివృద్ధి  కమిటీలు, అలాగే రకరకాల కులసంఘాల అధిపతులు, రాజ్యాంగేతర శక్తులుగా తయారై  గ్రామాలలో సర్పంచ్‌‌‌‌ పదవులు వేలం వేసి ఏకగ్రీవంగా ఎన్నికై ఒక దుష్ట సంప్రదాయానికి నాంది పలుకుతున్నారు. నోటాను  ఒక కల్పిత అభ్యర్థిగా గుర్తించినప్పుడు ఏకగ్రీవ ఎన్నికకు ఆస్కారముండదు.

ఎన్నికలు జరగవలసిందే. ఒక వేళ నోటాకే అధికంగా ఓట్లు వస్తే రీపోల్‌‌‌‌,  అలాగే  బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరూ రీపోల్‌‌‌‌లో నిలబడడానికి వీలు లేదన్న షరతులతో పంచాయతీ  ఎన్నికలలో సర్పంచ్‌‌‌‌ పదవి హర్రాజు ఆగిపోతుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం హర్యానాలో  మాదిరిగా ‘నోటా’ అమలులో మార్పు చేసినా బాగుంటుంది. 

ఎం. పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్​ గుడ్​ గవర్నెన్స్​