తీరాన్ని తాకిన మోంథా తుఫాను.. ఏపీలోని ఈ ఏడు జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ.. రాకపోకలు బంద్

తీరాన్ని తాకిన మోంథా తుఫాను.. ఏపీలోని ఈ ఏడు జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ.. రాకపోకలు బంద్

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాను తీరాన్ని తాకింది. కాకినాడ సమీపంలోని రాజోలు- అల్లవరం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 3- నుంచి 4 గంటలు అత్యంత కీలకం అని, తీరాన్ని దాటడానికి మరో 6 గంటలు పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాను తీరం దాటాక ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మత్స్యకారులు బుధవారం కూడా వేటకు వెళ్లొద్దని సూచించింది.

తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. షాపులు, సినిమా థియేటర్లు మూసివేశారు. మోంతా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో.. నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీ పాఠశాలలకు, జానియర్ కళాశాలలకు బుధవారం కూడా జిల్లా అధికార యంత్రాంగం సెలవు ప్రకటించింది. ఈ ఆదేశాలను ప్రైవేట్ స్కూల్స్, జానియర్ కాలేజీల యాజమాన్యాలు తప్పనిసరిగా అమలు చేసి సెలవు సమాచారం విద్యార్థులకు చెప్పాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న ఏడు జిల్లాల్లో రాత్రి 8:30 నుంచి వాహనాలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందనే హెచ్చరికల క్రమంలో.. ఈరోజు రాత్రి 8:30 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వాహనాలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు పంపింది. జాతీయ రహదారులు సహా అన్ని రకాల రహదారులపై ట్రాఫిక్ను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఆదేశాలు అందాయి. అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లేవారికి మాత్రం ఈ ఆదేశాల నుంచి ప్రభుత్వం మినహాయింపు ప్రకటించింది. తుఫాను ప్రభావం తగ్గే వరకూ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.