తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. మంగళవారం (అక్టోబర్ 28) ఏర్పాటు చేసిన బోర్డు సమావేశంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల బుక్ లెట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాణిపాకంలో నూతన యాత్రికుల వసతి సముదాయం నిర్మాణం, గ్రామాల్లో భజన మందిరాలు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
మంగళవారం (అక్టోబర్ 28) నిర్వహించిన టీటీడీ బోర్డు మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించారు. పర్మనెంట్ ఉద్యోగులకు రూ.15,400, కాంట్రాక్ట్/ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ.7,535 బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా తిరుమల, తిరుపతి సిబ్బందికి అదనంగా 10 శాతం ఇవ్వనున్నట్లు తెలిపారు.
టీటీడీ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు:
- ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం వద్ద 100 గదుల ఆధునిక అతిథి భవనం నిర్మాణం
- అందుకోసం రూ.37 కోట్ల నిధులు విడుదలకు ఆమోదం
- రూ.2.96 కోట్లతో 1.35 ఎకరాల్లో పవిత్ర వనం నిర్మాణం.
- కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం: రూ.25 కోట్లతో యాత్రికుల వసతి సముదాయం
- చెన్నై టి.నగర్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద రూ.14 కోట్లతో 6,227 చ.అ. స్థలం కొనుగోలు.
- రూ.30 కోట్లతో కరీంనగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, రాజగోపురం, మాడ వీధుల నిర్మాణం
- ధర్మ ప్రచారంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో 5 వేల భజన మందిరాలు, ఆలయాలు నిర్మాణం
- టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాల్లో నిరంతర అన్నదానం.
ఈ సమావేశంలో అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఇతర బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
