ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి జాతర ఘనంగా సాగుతోంది. మంగళవారం (అక్టోబర్ 28) ఉద్దాల మహోత్సవం నిర్వహించారు. ఉద్దాల ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. కురుమూర్తి బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన ఘట్టమైన ఉద్దాల ఉత్సవాన్ని చూసేందుకు ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.
ఉద్దాలు అంటే స్వామివారి పాదుకలు (చెప్పులు). చిన్న చింతకుంట మండలం వడ్డెమాన్ గ్రామ ప్రజలు తయారు చేసిన ఉద్దాలను కురుమూర్తి స్వామికి, అమ్మవారికి సమర్పిస్తారు. ఉద్దాలను కురుమూర్తికి తరలించే ముందు పళ్లమర్రి గ్రామానికి చెందిన మేదరు లు తయారు చేసిన ప్రత్యేక చాటలో ఉంచి ఊరేగింపు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్దాలను (పాదుకలను) తాకేందుకు భక్తులు పోటీపడ్డారు.
పెద్ద సైజు ఉద్దాలు వెంకటేశ్వర స్వామికి, చిన్న సైజు ఉద్దాలు అమ్మవారికి, రాయలసీమ నుంచి తెప్పించిన తోలుతో వీటిని కుడతారు. దీపావళి తర్వాత కుట్టే పనిని మొదలుపెట్టి ఏడు రోజుల్లో పూర్తిచేస్తారు. ఆ సమయంలో కుంటుంబాలు నియమ, నిష్టతో ఉపవాస దీక్షలో ఉంటాయి.
675 ఏండ్లుగా బ్రహ్మోత్సవాలు
మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌లో వెలిసిన కురుమూర్తి క్షేత్రానికి వందల ఏండ్ల చరిత్ర ఉంది. దాదాపు 675 ఏండ్ల కింద ముక్కెర వంశానికి చెందిన సంస్థానాధీశులు క్షేత్రంలో బ్రహ్మోత్సవాల నిర్వహణను ప్రారంభించారు. యేటా కార్తీకమాసంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా మారింది.
జాతరలో స్వామికి నిర్వహించే ఉద్దాల వేడుక హైలెట్‌గా నిలుస్తుంది. ఉద్దాల రోజు మాత్రమే లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. కొత్త కుండలో అన్నం, పచ్చి పులుసు వండి స్వామికి నైవేద్యంగా అందిస్తారు. పుష్కరిణిలో పుణ్య స్నానాలు చేసి స్వామికి తలనీలాలు ఇస్తారు. తిరుపతికి వెళ్లలేని పేదలు ఇక్కడి వేంకటేశ్వరుడిని దర్శించుకుంటే తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నట్లేనని నమ్మకం ఉంది.
వినూత్న వేషధారణలతో వచ్చి..
ఉద్దాల ఉత్సవానికి గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలే ఎక్కువగా వస్తారు. వచ్చేటప్పుడు వినూత్నంగా వేషధారణలతో వచ్చి స్వామిని దర్శించుకుంటారు. పుణ్య స్నానాలు చేసి నుదుట పెద్ద బొట్టు పెట్టుకొని ఒంటినిండా బంతి పూల మాలను ధరిస్తారు. చేతుల్లో నెమలి పింఛం పట్టుకొని ఊరేగింపుగా వస్తారు.
రైలు, రోడ్డు మార్గాన చేరుకోవచ్చు
కురుమూర్తి క్షేత్రానికి రైలు, రోడ్డు మార్గాన యాత్రికులు చేరుకోవచ్చు. హైదరాబాద్‌నుంచి రైలు మార్గాన వచ్చే వారు దేవరకద్ర లేదా కురుమూర్తి రైల్వే స్టేషన్, వనపర్తి రోడ్డు రైల్వే స్టేషన్లో దిగొచ్చు. అక్కడి నుంచి బస్సు, ప్రైవేట్‌వాహనాల్లో క్షేత్రానికి చేరుకోవచ్చు. రోడ్డు మార్గాన హైదరాబాద్‌నుంచి వచ్చేవారు ఎన్‌హెచ్– 44 మీదుగా జడ్చర్ల నుంచి మహబూబ్నగర్బస్టాండ్కు చేరుకోవాలి.
అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా 55 కిలోమీటర్ల దూరంలోని క్షేత్రానికి చేరుకోవచ్చు. అలాగే కర్నూలు వైపు నుంచి ఎన్‌హెచ్–-44 మీదుగా వచ్చే వారు కొత్తకోటకు చేరుకోవాలి. అక్కడే వనపర్తి డిపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా మదనాపురం, కొత్తపల్లి, దుప్పల్లి, అమ్మాపూర్మీదుగా క్షేత్రానికి చేరుకోవచ్చు.
