- ఎప్ స్టీన్ ఫైల్స్ తాజా డాక్యుమెంట్లలో సంచలన విషయాలు వెల్లడి
- బిల్ గేట్స్‌కు సుఖవ్యాధులు!
- ఇది పూర్తిగా తప్పుడు సమాచారమేనన్న గేట్స్ ప్రతినిధి
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఫైనాన్సర్, లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ లో తాజాగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన విషయాలు బయటకొచ్చాయి. బిల్ గేట్స్ రష్యన్ అమ్మాయిలతో లైంగిక చర్యలకు పాల్పడి, సుఖవ్యాధుల బారిన పడ్డారని ఎప్స్టీన్ ఈ–మెయిల్స్ ద్వారా వెల్లడైంది. అలాగే ఇజ్రాయెల్ విషయంలో ట్రంప్ రాజీపడ్డారని ఎఫ్‌బీఐ ఓ రిపోర్టు ఇచ్చిందన్న విషయం కూడా బయటపడింది. ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించి అమెరికా న్యాయ శాఖ శుక్రవారం 30 లక్షలకుపైగా పేజీల డాక్యుమెంట్లను రిలీజ్ చేసింది.
వీటిలో 2 వేల వీడియోలు, 1.80 లక్షల ఫొటోలు కూడా ఉన్నాయి. తాజాగా రిలీజ్ అయిన డాక్యుమెంట్లలో ఈ మేరకు బిల్ గేట్స్, ట్రంప్ పై ఎప్స్టీన్ సంచలన ఆరోపణలు చేశారు. రష్యన్ అమ్మాయిలతో బిల్ గేట్స్ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నారని, దాంతో సుఖవ్యాధుల బారిన పడ్డారని ఎప్స్టీన్ 2013లో రాసుకున్న ఈ–మెయిల్స్ లో పేర్కొన్నట్టు తాజా డాక్యుమెంట్ల ద్వారా వెల్లడైంది. సుఖవ్యాధులను తగ్గించుకునేందుకు మందులు తెప్పించుకునేందుకు గేట్స్ తనను సహాయం కోరారని, అలాగే తన భార్య మిలిండా గేట్స్ కు తెలియకుండా ఆమెకు ఇచ్చేందుకు యాంటీబయాటిక్స్ మందులు కూడా తెప్పించాలని అడిగారని ఎప్ స్టీన్ పేర్కొన్నాడు. కాగా, తాజా ఎప్ స్టీన్ ఫైల్స్ లో బిల్ గేట్స్‌పై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధమని గేట్స్ అధికార ప్రతినిధి ఖండించారు.
ట్రంప్ పై ఇజ్రాయెల్ ప్రభావం..
అమెరికా ప్రెసిడెంట్‌గా ట్రంప్ ఫస్ట్ టర్మ్ బాధ్యతలు నిర్వహించిన సమయంలో ఆయన ఇజ్రాయెల్ ప్రభావానికి గురయ్యారని, ఈ విషయంపై ఎఫ్‌బీఐ ఓ రిపోర్టును రూపొందించిందని కూడా తాజాగా రిలీజ్ అయిన ఎప్ స్టీన్ ఫైల్స్‌లో వెల్లడైంది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్‌కు ఎప్స్టీన్ గూఢచర్యం చేశాడని, ఇజ్రాయెల్ విషయంలో ట్రంప్ రాజీ పడ్డారని తాజా డాక్యుమెంట్ల ద్వారా బయటపడింది. అమెరికా అధికారులపై ఇజ్రాయెల్ తోపాటు రష్యా, యూఏఈ ప్రభావం కూడా ఉందని ఎఫ్ బీఐ పేర్కొన్నట్టు తేలింది. అలాగే ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ అక్రమాస్తులు పోగేశారని కూడా ఎఫ్ బీఐ రిపోర్టులో పేర్కొన్నట్టుగా తాజా ఫైల్స్‌లో ఆరోపణలు ఉన్నాయి.
మస్క్‌కు ఎప్స్టీన్.. ఎప్ స్టీన్‌కు ఆండ్రూ ఆహ్వానం..
తన ఐల్యాండ్‌కు రావాలని టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు ఎప్స్టీన్ ఆహ్వానాలు పంపాడని తాజా డాక్యుమెంట్లలో బయటపడింది. అయితే, ఈ ఆహ్వానాలను మస్క్ తిరస్కరించారని వెల్లడైంది. బకింగ్ హామ్ ప్యాలెస్‌ను సందర్శించాలని ఎప్స్టీన్కు బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ 3 సోదరుడు ఆండ్రూ మౌంట్ బాటన్ విండ్సర్ 2010లో ఆహ్వానం పంపారని బయటపడింది. మరోవైపు ఓ మహిళతో ఆండ్రూ సన్నిహితంగా ఉన్న రెండు ఫొటోలు కూడా తాజా డ్యాకుమెంట్లలో బయటకు వచ్చాయి. కాగా, సెక్స్ ట్రాఫికింగ్ అభియోగాలు, మైనర్ బాలికలతో లైంగిక చర్యలకు సంబంధించిన కేసుల్లో అరెస్టు అయిన ఎప్స్టీన్ విచారణకు ముందు 2019లో జైలులో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు.
