- 7 నగరాల్లో 12 చోట్ల దాడులు
- సూసైడ్ బాంబింగ్స్, తుపాకులతో విరుచుకుపడిన వేర్పాటువాదులు
- 10 మంది అధికారులు మృతి.. 37 మంది రెబల్స్ హతం
- ‘ఆపరేషన్ హెరాఫ్’ పేరుతో దాడులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) తిరుగుబాటుదారులు బీభత్సం సృష్టించారు. శనివారం ఉదయం బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని 7 నగరాల్లో 12 చోట్ల తుపాకులు, సూసైడ్ బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో 10 మంది అధికారులు చనిపోయారు. డజన్ల సంఖ్యలో పోలీసులు గాయపడ్డారు. భద్రతా బలగాలు చేసిన ప్రతిదాడుల్లో 37 మంది బలూచ్ వేర్పాటువాదులు కూడా హతమయ్యారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని క్వెట్టా, పస్నీ, మస్తుంగ్, నుష్కి, గ్వదార్ జిల్లాల్లో ఈ దాడులు జరిగాయి.
ఆపరేషన్ హెరాఫ్’ పేరుతో వేర్పాటువాదులు ఈ అటాక్స్ కు పాల్పడ్డారు. ఒక్క క్వెట్టాలోనే నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దాడులకు బాధ్యత తమదేనని బీఎల్ఏ ప్రకటించింది. మిలిటరీ స్థావరాలు, అధికారులను లక్ష్యంగా చేసుకుని సమన్వయం చేసుకుంటూ దాడులు నిర్వహించామని బీఎల్ఏ తెలిపింది. ఆపరేషన్ హెరాఫ్ పేరుతో నిర్వహించిన ఈ దాడితో రెండో దశ ప్రారంభమైందని పేర్కొంది. తమ మాతృభూమిని కాపాడుకోవడానికి బలూచిస్తాన్ ప్రావిన్స్ లో భవిష్యత్తులో భీకరమైన దాడులు నిర్వహిస్తామని గతంలోనే వేర్పాటువాదులు హెచ్చరించారు.
క్వెట్టాలో పరిస్థితి భయానకం
వేర్పాటువాదుల భీకర దాడితో బలూచిస్తాన్ ప్రావిన్స్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా క్వెట్టాలో పరిస్థితి ఘోరంగా ఉందని అధికారులు తెలిపారు. క్వెట్టాలోని పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు, వేర్పాటువాదులకు మధ్య బీభత్సంగా కాల్పులు జరిగాయని చెప్పారు. దీంతో క్వెట్టా సిటీలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అలాగే, దాడులు జరిగిన పలు నగరాలకు ఎమర్జెన్సీ బృందాలను తరలించారు. వేర్పాటువాదులు చేసిన దాడుల్లో పౌరులెవరూ చనిపోలేదని పోలీసులు వెల్లడించారు.
ప్రజల ప్రాణాలకు నష్టం జరగకుండా రెబల్స్ ను మట్టుబెట్టామని చెప్పారు. రెబల్స్ దాడులు విస్తరించకుండా చూశామని, ఎక్కడికక్కడ వారిని అడ్డుకున్నామని చెప్పారు. దీంతో మరణాల సంఖ్య పెరగకుండా చూశామన్నారు. కాగా.. కొన్ని దశాబ్దాలుగా బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని బలూచ్ వేర్పాటువాదుల గ్రూప్ రెచ్చిపోతున్నది. తమ ప్రావిన్స్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని ప్రభుత్వంపై పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో భద్రతా బలగాలు, విదేశీయులు, బలూచ్ యేతర ప్రాంతానికి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది.
