ఉపాధి హామీ ఉసురు తీసేందుకు కుట్ర : ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

ఉపాధి హామీ ఉసురు తీసేందుకు కుట్ర : ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

ఉప్పునుంతల, వెలుగు: ఉపాధి హామీ పథకం ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆరోపించారు. శుక్రవారం ఉప్పునుంతల గ్రామంలో ఉపాధిహామీ కూలీలతో సమావేశమయ్యారు. ఉపాధిహామీకి నిధులు తగ్గించడం ద్వారా గ్రామీణుల ఉపాధి హక్కును కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్​చేశారు.  రైతులు యూరియా కోసం ఆందోళన చెందొద్దని సూచించారు. స్లాట్ బుక్​చేసిన 24 గంటల్లో యూరియాను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్​ను రూపొందించినట్లు పేర్కొన్నారు. 

యాప్ వినియోగంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే  వ్యవసాయ అధికారులను సంప్రదించాలని చెప్పారు.  ఉప్పునుంతల సర్కారు దవాఖానలో డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని, ఇలా వచ్చి అలా వెళ్తున్నారని ప్రజలు ఫిర్యాదు చేయడంతో ఆస్పత్రిని తనిఖీ చేశారు. మరోసారి ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటామని వైద్యులు, సిబ్బందిని హెచ్చరించారు.  

కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి  

వంగూరు: కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. వంగూరు మండలంలోని అన్నారం నుంచి ముక్కురాళ్ల వరకు బీటీ రోడ్డు పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. జాజాల గ్రామంలో మాజీ ఎంపీటీసీ చిన్నయ్య తల్లి మృతిచెందడంతో బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. సర్పంచ్ గోపాల్ రెడ్డి, కల్వకుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

టీచర్లు సేవాభావంతో పని చేయాలి   

అమ్రాబాద్: ప్రభుత్వ టీచర్లు సేవాభావంతో పని చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ సూచించారు. అమ్రాబాద్ ప్రైమరీ స్కూల్​టీచర్, తన బాల్య మిత్రుడు గోరటి పరశురాములు ఉద్యోగ విరమణ కార్యక్రమానికి శుక్రవారం ఆయన హాజరయ్యారు. తన బాల్యాన్ని గుర్తు చేసుకొని, పాత రోజులు మళ్లీ వస్తే బాగుండని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, అచ్చంపేటకు ఇంటిగ్రేటెడ్​  స్కూల్ మంజూరు చేశారన్నారు. 

అనంతరం మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. వ్యవసాయ మార్కెట్ లోని సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎంఈవో బాలకిషన్, సర్పంచ్​ కోటయ్య, కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.