అమెరికాలో మళ్లీ షట్డౌన్

అమెరికాలో మళ్లీ షట్డౌన్
  • 2026 బడ్జెట్ ఆమోదించడంలో కాంగ్రెస్ విఫలం
  • డిఫెన్స్, ఎడ్యుకేషన్ సెక్టార్లపై ప్రభావం
  • డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య మాటల యుద్ధం
  • డీహెచ్ఎస్ నిధుల విషయంలో కుదరని ఏకాభిప్రాయం
  • షట్​డౌన్ పాక్షికమేనని సెనేటర్ల ధీమా

వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం పాక్షికంగా షట్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను ఆమోదించడంలో కాంగ్రెస్ విఫలం కావడమే దీనికి ప్రధాన కారణం. ఫలితంగా ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా నిలిచిపోయాయి. డిఫెన్స్, ఎడ్యుకేషన్, హెల్త్, గృహనిర్మాణ శాఖలతో సహా అనేక కీలక విభాగాలు ప్రభావితమయ్యాయి. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ ‘ఏఎఫ్​పీ’ షట్​డౌన్ వివరాలను శనివారం వెల్లడించింది.

జనవరి 30 అర్ధరాత్రితో ప్రభుత్వం వద్ద ఉన్న నిధుల గడువు ముగిసింది. అయితే, ‘హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ’ (డీహెచ్ఎస్) నిధుల విషయంలో డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

ముఖ్యంగా ట్రంప్ ఆదేశాల మేరకు మిన్నియాపాలిస్‌‌‌‌‌‌‌‌ నగరంలో ఫెడరల్ ఏజెంట్ల కాల్పుల్లో గుడ్, ప్రెట్టి అనే ఇద్దరు నిరసనకారులు మృతిచెందడం పట్ల డెమొక్రాట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బడ్జెట్ చర్చలను బాయ్​కాట్ చేశారు. ‘‘చట్టాన్ని అమలుచేసే అధికారులకు అమెరికా ప్రజలు మద్దతిస్తారు. సరిహద్దు భద్రతా దళాలకు మద్దతుగా నిలుస్తారు. కానీ, వీధుల్లో భయభ్రాంతులకు గురిచేసే, అమెరికా  పౌరులను చంపే ఐసీఈ అధికారులను ఉపేక్షించబోరు’’ అని తీవ్రంగా స్పందించారు. 

దానిని సంస్కరించకపోతే నిధుల విడుదల బిల్లుకు అవసరమైన ఓట్లు వేయబోమంటూ వారు హెచ్చరించారు. ఫెడరల్ ఏజెంట్ల ప్రవర్తన, వారి అధికారాలపై కొత్త పరిమితులను విధిస్తూ బడ్జెట్ బిల్లును పూర్తిగా తిరిగి రాయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏజెంట్లపై కఠినమైన నిబంధనలు చేరిస్తే తప్ప, డీహెచ్​ఎస్ విభాగానికి నిధులు ఇచ్చే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు.

సోమవారం ప్రతినిధుల సభ

ఇది పాక్షిక షట్‌‌‌‌‌‌‌‌డౌన్ అని, అన్ని శాఖలపై ప్రభావం ఉండదని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం సుమారు 75% ఫెడరల్ కార్యకలాపాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని వివరించారు. ఎమర్జెన్సీ సర్వీసులు, సైన్యం, విమాన ప్రయాణాలు, సోషల్ సెక్యూరిటీ వంటి కీలక సేవలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. అయితే, ఈ షట్‌‌‌‌‌‌‌‌డౌన్ ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని చట్టసభ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సెనేట్ ఇప్పటికే ఆమోదించిన నిధుల ఒప్పందానికి, సోమవారం ప్రతినిధుల సభ కూడా ఆమోదం తెలుపుతుందని భావిస్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వ కార్యకలాపాలు మళ్లీ సజావుగా సాగనున్నాయి. కాగా, నిరుడు అక్టోబర్ 1న కూడా అమెరికా ప్రభుత్వం షట్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ అయింది. ఆ దేశ చరిత్రలో 43 రోజుల పాటు షట్​డౌన్ కొనసాగింది.

భద్రత లేకుండా పోతున్నది..సెనేట్ డెమొక్రాటిక్ మైనారిటీ విప్

అమెరికా ప్రభుత్వ షట్‌‌‌‌‌‌‌‌డౌన్ వేళ రాజకీయ విమర్శలు తారస్థాయికి చేరుకున్నాయి. డ్రగ్ స్మగ్లర్లు, చైల్డ్ క్రిమినల్స్, హ్యుమన్ ట్రాఫికర్లను పట్టుకోవాల్సిందిపోయి.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై ట్రంప్ ప్రభుత్వం కాల్పులు జరపడాన్ని సెనేట్ డెమొక్రాటిక్ మైనారిటీ విప్ డిక్ డర్బిన్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా అమెరికన్లకు భద్రత లేకుండాపోతున్నదని ఆందోళన 
వ్యక్తం చేశారు.