ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ OpenAI ఎగ్జిక్యూటివ్ కాన్ఫరెన్స్ రూంలో సీక్రెట్ కెమెరాలను అమర్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను యూఎస్ ఫెడరల్ ఏజెంట్లు (FBI) అరెస్ట్ చేసింది. స్పై కెమెరా ఏర్పాటు చేయడం ద్వారా కంపెనీకి చెందిన సీక్రెట్ సమాచారాన్ని దొంగిలించేందకు యత్నించినట్లు ఆరోపణలతో ఓపెన్ ఏఐ సంస్థ ఇంజనీర్, సౌదీ కి చెందిన అబ్దుల్రహ్మాన్ అల్ఫోజాన్ ను FBI అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ స్పై కెమెరాను కనిపెట్టడంలో, నిందితుడి మూలాలను గుర్తించడంలో ఆసక్తికరమైన విషయమేమిటంటే, AI మోడల్స్‌ను ఉపయోగించింది ఓపెన్ ఏఐ సంస్థ. ఈ ఘటన వెలుగులోకి రావడంతో సంస్థ నిందితుడిని ఉద్యోగం నుంచి తొలగించారు. నేరం రుజువయితే ఐదేళ్లు జైలు, 2కోట్ల జరిమానా పడే అవకాశం ఉందని చెబుతోంది యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్.
2025 నుంచి నిందితుడు అబ్దుల్ రహ్మాన్ అల్ఫోజన్ OpenAI సంస్థలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. శాన్ ఫ్రాన్సిస్కోలోని OpenAI సెంట్రల్ ఆఫీసులో ఓ ఎగ్జిక్యూటివ్ కాన్ఫరెన్స్ రూమ్‌లో టీవీ వెనుక ఉన్న USB పోర్ట్‌లో టాయిలెట్ పేపర్‌తో చుట్టి ఉంచిన లెటెస్ట్ రికార్డింగ్ పరికరాన్ని సెప్టెంబర్ 30న భద్రతా సిబ్బంది కనుగొన్నారు.
ఓపెన్ AI సంస్థకు చెందిన అత్యంత రహస్య టెక్నాలజీ, భవిష్యత్తు ప్రణాళికలు, వ్యాపార వ్యూహాలపై కీలక చర్చలు స్పైకెమెరా అమర్చిన రూంలోనే జరుగుతుంటాయని సంస్థ తెలిపింది. దీంతోపాటు ఆఫీసులో ఓ బ్యాగులో మరో రికార్డింగ్ డివైజ్ ను కూడా ఉంచినట్లు గుర్తించారు. ఈ డివైజ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు అమర్చారు అనే విషయాలను తెలుసుకునేందుకు OpenAI తమ సొంత AI మోడల్స్‌ను రంగంలోకి దించింది.
AI అందించిన డేటా, ఆఫీస్ వీడియో సర్వైలెన్స్ ఆధారంగా... కాన్ఫరెన్స్ రూంలోకి ప్రవేశించే అధికారం లేకపోయినప్పటికీ అల్ఫోజాన్ అక్కడ అనుమానాస్పదంగా తిరిగినట్లు గుర్తించారు. కొన్ని రోజులకు ముందే అతనే ఈ డివైజ్ ను అక్కడ అమర్చినట్లు AI సహాయంతో నిర్ధారించారు. ఈ విషయాన్ని FBI కి ఫిర్యాదు చేసింది.
డేటా చోరీ జరిగిందా?..
ప్రస్తుతానికి సంస్థ అత్యంత కీలకమైన సోర్స్ కోడ్, కస్టమర్ డేటా లేదా మోడల్ వెయిట్స్ వంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ దొంగిలించినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని OpenAI స్పష్టం చేసింది.
ఎలాంటి శిక్ష పడవచ్చు?
యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ) తెలిపిన వివరాల ప్రకారం, నేరం రుజువైతే నిందితుడికి గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష, రూ.2.1 కోట్లు జరిమానా పడే అవకాశం ఉందని తెలిపింది.ప్రస్తుతం FBI ఈ వ్యవహారంపై తదుపరి విచారణ జరుపుతోంది.
