- అన్ని పార్టీల్లోనూ అదే పరిస్థితి
గద్వాల, వెలుగు: టికెట్ రాని ఆశావహులు పార్టీలకు షాక్ ఇస్తున్నారు. పొద్దున ఒక పార్టీలో తిరిగిన వారు, సాయంత్రం కల్లా మరో పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇలా అన్ని పార్టీలకు చెందిన లీడర్లు ఆయా పార్టీల టికెట్లు రాకపోవడంతో నామినేషన్ల చివరి రోజు పక్కచూపులు చూశారు.
గద్వాల మున్సిపాలిటీలో చాలా మంది టికెట్ల కోసం ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు. వారం రోజుల నుంచి అన్ని పార్టీల లీడర్లతో టచ్ లో ఉన్నవారు, టికెట్ రాకపోవడంతో చివరి నిమిషంలో పార్టీ మారి బీఫామ్ తీసుకొని ఆ పార్టీ గుర్తుపై పోటీ చేస్తున్నారు.
రాత్రికి మరో పార్టీలోకి జంప్..
గద్వాల మున్సిపాలిలోని కొందరు లీడర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టికెట్ కోసం చివరి క్షణం వరకు వేచి చూసిన లీడర్లు, బీఫామ్రాకపోవడంతో పక్క పార్టీల వైపు పరుగులు పెట్టారు. ఏండ్లుగా ఒక పార్టీలో ఉంటూ తాము పోటీలో ఉంటామని చెబుతూ కార్యకర్తలు, కాలనీవాసులకు తమ పార్టీ గుర్తు చెప్పుకుంటూ వచ్చారు. కానీ, పార్టీ టికెట్ రాకపోవడంతో యూటర్న్ తీసుకొని రాత్రికి రాత్రే కండువా మార్చేసి వేరే పార్టీ టికెట్ పై పోటీ చేస్తున్నారు. దీంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఇన్ని రోజులు విమర్శిస్తూ వచ్చిన పార్టీలోకి వెళ్లి ఆ పార్టీకి ఓటు వేయాలని చెబుతుండడంతో షాక్ గురవుతున్నారు.
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి..
గద్వాల కాంగ్రెస్ లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గంతో పాటు జడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గం ఉంది. తమ కార్యకర్తలకు టికెట్లు కావాలంటే, తమ కార్యకర్తలకు టికెట్ కావాలంటూ చివరి వరకు ఇరు వర్గాలు పట్టుబట్టాయి. చివరికి ఎమ్మెల్యే వర్గానికి టికెట్లు రావడంతో జడ్పీ మాజీ చైర్పర్సన్ వర్గానికి చెందిన 13 మంది బీఆర్ఎస్ లో చేరారు. 4,7, 9,13,22,23,16 వార్డులకు చెందిన నాయకులు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. వీరికి బీఆర్ఎస్ బీఫామ్ ఇవ్వడంతో వారు కారు గుర్తుపై మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
లోపాయికారి ఒప్పందాలు..
ఎన్నికల్లో లోపాయికారి ఒప్పందాలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ లో రెండు వర్గాలు ఉండడంతో టికెట్లు రాని వారు తమ పార్టీలో చేరతారని ప్రతిపక్ష పార్టీ ముందుగానే అంచనా వేసింది. గద్వాల మున్సిపాలిటీలో 37 వార్డులు ఉండగా, మొదటి విడతలో ఆ పార్టీ కేవలం 17 మంది పేర్లను మాత్రమే డిక్లేర్ చేసింది. ఆ తరువాత వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడంతో సీక్రెట్‌గా లోపాయికారి ఒప్పందం చేసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 13 మంది ఇతర పార్టీల నుంచి చేరిన వారికి టికెట్లు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
పాలమూరు కాంగ్రెస్‌లో వర్గపోరు..60 డివిజన్లకు 328 మంది నామినేషన్
మహబూబ్‌నగర్: కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నామినేషన్ల పర్వం ముగిసింది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. కార్పొరేషన్ పరిధిలోని లీడర్లు ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తుండగా, వారిని ఏకతాటి పైకి తీసుకురావడంలో లీడర్లు ఫెయిల్ అయ్యారు.
ప్రధానంగా నగరంలో అధికార పార్టీకి చెందిన ముగ్గురు లీడర్ల మధ్య వర్గాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టికెట్లు ఆశిస్తున్న ఈ మూడు వర్గాలకు చెందిన వారి మద్దతుదారులు ఆయా డివిజన్లలో నామినేషన్లు వేశారు. ఇటీవల ఆశావహుల మధ్య ఏకాభిప్రాయం కుదిర్చే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయిందని తెలిసింది.
