దేశ ఆర్థిక సమస్యలను ఈ బడ్జెట్ పరిష్కరిస్తుందా? : ఖర్గే

దేశ ఆర్థిక సమస్యలను ఈ బడ్జెట్ పరిష్కరిస్తుందా? : ఖర్గే
  • మోదీ సర్కార్  ఇక లెగసీ సాకుతో తప్పించుకోలేదు: ఖర్గే

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర గందరగోళంలో ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఫ్రీ ఫాల్‌‌లో ఉన్న ఆర్థిక సూచికల (తయారీ రంగం, ఉద్యోగాలు, సేవింగ్స్, రూపాయి విలువ మొదలైనవి)కు ఆదివారం ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ నిజమైన పరిష్కారాలు అందిస్తుందా?" అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. " భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం గందరగోళంలో ఉంది. ఇకపై మోదీ ప్రభుత్వం లెగసీ సాకుతో తప్పించుకోలేదు. ఎందుకంటే గడిచిన 12 ఏండ్లుగా బీజేపీనే కేంద్రంలో అధికారంలో ఉంది.

ఎన్డీయే సర్కారే ఆర్థిక వ్యవస్థను అతిపెద్ద సంక్షోభంలోకి నెట్టింది. మరిప్పుడు ఫ్రీ ఫాల్‌‌లో ఉన్న ఆర్థిక సూచికలకు కేంద్ర బడ్జెట్ నిజమైన పరిష్కారాలు అందిస్తుందా?" అని ఖర్గే ప్రశ్నించారు. ఆయన తన పోస్ట్‌‌తో పాటు ఒక వీడియోను కూడా షేర్ చేశారు. ఆ వీడియోలో ఎకనామిక్ సర్వే ఆధారంగా ప్రభుత్వ డేటాను ఉటంకిస్తూ.. తయారీ రంగం వృద్ధి యూపీఏ పాలనలో సగటు 7.4 శాతం ఉండగా, ఎన్‌‌డీఏ పాలనలో 3.54 శాతానికి పడిపోయిందని ఖర్గే వివరించారు.