మోంథా తుఫాన్ తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. అక్టోబర్ 28న తీరం దాటిన తుఫాన్.. ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీనికి తోడు ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అక్టోబర్ 28న మధ్యాహ్నం తర్వాత వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో అల్లకల్లోలం సృష్టిస్తున్న మోంథా తుఫాన్.. తెలంగాణలో కూడా రైతులను భయాందోళనలకు గురిచేస్తోంది. మంగళవారం (అక్టోబర్ 28) మధ్యాహ్నం తరువాత మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD పేర్కొంది.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్:
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో తదుపరి 2-3 గంటల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 41- 61 కి.మీ.ల మధ్య గరిష్ట ఉపరితల గాలి వేగంతో (గాలులు వీచే) మోస్తరు ఉరుములతో కూడిన వర్షాలు ఒకటి రెండు చోట్ల వచ్చే అవకాశం వుందని తెలిపింది.
హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్:
మోంథా ప్రభావంతో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. హన్మకొండ, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, జోగులాంబ గద్వాల్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ జిల్లాల్లో గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీ కంటే తక్కువ (గాలులలో) తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు ఒకటి రెండు చోట్ల వచ్చే అవకాశం వుందని పేర్కొన్నారు.
►ALSO READ | Cyclone Montha : లైవ్ అప్ డేట్స్ : భీకర తుఫాన్ గా మోంథా
