- మోంథా తుఫాన్ ఎఫెక్ట్: కాకినాడకు గ్రేట్ డేంజర్ సిగ్నల్
- కాకినాడ పోర్టులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ
- విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నంలో 9వ డేంజర్ సిగ్నల్ జారీ
- మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవులకు 8వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ
తుఫాన్ మోంథా భీకరంగా మారింది. తీవ్ర తుఫాన్ గా తీరం దాటనుంది. భయంకరమైన గాలులు తీరాన్ని అల్లకల్లోలం చేయనున్నాయి. తీవ్ర తుఫాన్ గా మోంథా తీరం దాటనున్నట్లు.. 2025, అక్టోబర్ 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటించింది భారత వాతావరణ శాఖ. భీకర తుఫాన్ మోంథా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మచిలీపట్నం.. కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటనున్నట్లు ప్రకటించింది. తీరం దాటే సమయంలో 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతోపాటు అతి భారీ వర్షాలు పడనున్నట్లు వెల్లడించింది.
హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షాలు..
మోంథా తుఫాన్ ఎఫెక్ట్ తో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు తెలంగాణలోని పలుజిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అక్టోబర్ 28న తీరం దాటిన తుఫాన్ కారణంగా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ ఉన్నట్లుగా హెచ్చరించింది. అందులోభాగంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో తదుపరి 2-3 గంటల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇటు హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. హన్మకొండ, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, జోగులాంబ గద్వాల్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు.
సహాయక చర్యల్లో 11 NDRF ,12 SDRF బృందాలు
సహాయ చర్యలు వేగవంతం చేసింది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ అంతటా 11 NDRF ,12 SDRF బృందాలు సిద్ధం చేసింది. పడవలు, లైఫ్ జాకెట్లు, OBMలు, ఈతగాళ్ళు ,వైద్య కిట్లతో ప్రతి సహాయక బృందాలు రెడీగా ఉన్నాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్‌లను అందుబాటులో ఉంచింది. అత్యవసర అంబులెన్స్ నెట్‌వర్క్‌లు, 108 ,104 వాహనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి.
ఆస్థి, ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపట్టాలి: సీఎం చంద్రబాబు
మోంథా తుఫాన్ ఎఫెక్ట్ పై ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు. తుఫాన్ కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని, ఆస్థి నష్టాన్ని తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే తీర ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలింపు ప్రారంభించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు వైద్య సాయం అందేలా చర్యలు చేపట్టారు. ప్రతి పునరావాస కేంద్రంలో సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. ముందు జాగ్రత్తగా 787 మంది గర్భిణీలను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
కాకినాడకు డేంజర్ సిగ్నల్..
కాకినాడకు డేంజర్ సిగ్నల్ జారీ చేసింది వాతావరణ శాఖ. తీరం దాటే సమయంలో గంటకు 90 ననుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విరుచుకుపడే అవకాశం ఉంది. కాకినాడ జిల్లాలోని 12 మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు. 24 గంటల్లో ఏపీలోని 8 జిల్లాలకు ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాకినాడ సముద్ర తీరంలో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రానికి ఆనుకని ఉన్న గ్రామాల ప్రజలను పునరవాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. సహాయక చర్యలకోసం కాకినాడ, పిఠాపురం, తాళ్లరేవులో హెలీ పాడ్లు ఏర్పాటు చేశారు.
ఒడిశా హై అలర్ట్:
మోంథా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిషాపైన పడింది. ముఖ్యంగా ఒడిశాలోని ఎనిమిది దక్షిణ జిల్లాలు మల్కన్‌గిరి, కోరాపుట్, నబరంగ్‌పూర్, రాయగడ, గజపతి, గంజాం, కలహండి, కంధమల్పై తీవ్ర ప్రభావం చూపించనుంది. తుఫాన్ నేపథ్యంలో ఒడిషా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.
ఈ మేరకు తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో సహకయ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా1,496 మంది గర్భిణీ స్త్రీలు సహా దాదాపు 3,000 మందిని తరలించారు. 1445 తుఫాను ఆశ్రయాలను తెరిచారు. 140 రెస్క్యూ బృందాలను మోహరించింది. తుఫాను ప్రభావానికి గురయ్యే తొమ్మిది జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీలకు అక్టోబర్ 30 వరకు సెలవులు ప్రకటించారు.
తమిళనాడులో భారీ వర్షాలు:
మోంతా తుఫాను ప్రభావంతో చెన్నై, తిరువళ్లూరు, రాణిపేట, కాంచీపురంతో సహా ఉత్తర తమిళనాడులో మంగళవారం (అక్టోబర్ 28) భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. తుఫాను ఏపీ తీరం దాటిన కూడా ఈ ప్రాంతంలో వర్షాలు కొనసాగుతాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (RMC) తెలిపింది.
తుఫాను ఎఫెక్ట్‌తో తిరువళ్లూరు, చెన్నై జిల్లా కలెక్టర్లు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తుఫానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు.
కుండపోత వర్షాలు.. రెడ్ అలర్ట్ జిల్లాలు :
ఆంధ్రప్రదేశ్ : కాకినాడ, కోనసీమ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు
తెలంగాణ : ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, సూర్యాపేట,
ఈదురు గాలులు :
తీవ్ర తుఫాన్ మోంథా తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. గాలుల తీవ్రతకు చెట్లు కూలిపోవచ్చు. కరెంట్ వైర్లు కట్ అవుతాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటుంది.
రవాణాకు బ్రేక్ :
తీవ్ర తుఫాన్ మోంథా ప్రభావంతో ఇప్పటికే విశాఖపట్నం, రాజమండ్రి విమానాశ్రయాలు మూసివేత. అన్ని విమాన సర్వీసులు రద్దు చేసిన విమానయాన శాఖ. హైదరాబాద్ శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన అన్ని విమాన సర్వీసులు రద్దు.
రైళ్లు రాకపోకలు బంద్ :
విశాఖపట్నం, కాకినాడ నుంచి రాకపోకలు సాగించి 45 రైళ్ల రాకపోకలను రద్దు చేశారు అధికారులు. మరికొన్ని రైలు సర్వీసులను దారి మళ్లించారు.
బస్సు సర్వీసులు :
తీవ్ర తుఫాన్ తీరం దాటే కాకినాడ, మచిలీపట్నం, కళింగపట్నం ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలకు తిరిగే అన్ని బస్సు సర్వీసులను రద్దు చేశారు అధికారులు. ఆయా ప్రాంతాలకు తాత్కాలికంగా బస్సు సర్వీసులు నిలిపివేశారు.
రెస్క్యూ ఆపరేషన్ :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన విపత్తు నివారణ సర్వీసులకు చెందిన 500 బృందాలు ఫీల్డ్ లోకి దిగాయి. తుఫాన్ ముందు.. తర్వాత సహాయ చర్యలు చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
జనం తరలింపు :
తీవ్ర తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది ఏపీ ప్రభుత్వం. తుఫాన్ కేంద్రాలు, ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. మూడు రోజులు అక్కడే అన్నీ సౌకర్యాలు కల్పించే విధంగా ఏర్పాట్లు చేసింది.
