- సూసైడ్ కేసుల్లో 98 శాతం మోర్టాలిటీ రేట్
- విరుగుడు లేక కిడ్నీ, లివర్, లంగ్స్పై తీవ్ర ప్రభావం
- నిమ్స్‌కు వచ్చిన 500 కేసుల్లో 95 శాతానికి పైగా మృతి
- కేరళ, ఒడిశాలాంటి రాష్ట్రాల్లోనూ బ్యాన్
- మన రాష్ట్రంలో నిర్లక్ష్యంపై విమర్శలు
- సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: మంత్రి దామోదర
హైదరాబాద్ / మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలో గడ్డి మందు ప్రజల ప్రాణాలను తీసేస్తున్నది. పంటచేలలో గడ్డి గాదాన్ని నాశనం చేసే పారాక్వాట్ డైక్లోరైడ్ మందు.. మనిషి ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలను దెబ్బ తీస్తూ రోజుల వ్యవధిలోనే ప్రాణాలను బలిగొంటున్నది. ఈ గడ్డి మందు మార్కెట్లో తక్కువ ధరకే దొరుకుతుండటం, కొద్దిగంటల్లోనే గడ్డిని మాడిపోయేలా చేస్తుండటంతో రైతులు దీన్ని వాడేందుకే మొగ్గుచూపుతున్నారు. దాదాపుగా ప్రతి రైతు ఇంట్లోనో, పొలం వద్దనో పారాక్వాట్ గడ్డి మందు అందుబాటులో ఉంటోంది. దీంతో ఇంట్లో ఏ చిన్న గొడవ జరిగినా, ఆర్థిక ఇబ్బందులు, తగాదాల వంటి సమస్యలు, పరీక్షల్లో, ప్రేమలో ఫెయిల్ అవడం లాంటి చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంలో రైతులు, రైతుల పిల్లలు ఈ మందు తాగుతున్నారు. దీనికి విరుగుడు లేకపోవడంతో కొన్ని రోజుల పాటు ప్రాణాలతో పోరాడి, కిడ్నీలు, కాలేయం దెబ్బతిని, ఊపిరితిత్తులు చెడిపోయి చివరికి చనిపోతున్నారు.
మరోవైపు దీని అమ్మకాలపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో ఫర్టిలైజర్ షాపులతో పాటు ఆన్‌లైన్‌లోనూ విచ్చలవిడిగా అమ్ముతున్నారు. రాష్ట్రంలో రోజూ పదుల సంఖ్యలో పారాక్వాట్ మరణాలు సంభవిస్తున్నట్టు అంచనా. ఒక్క నిమ్స్ హాస్పిటల్ కే రోజుకు కనీసం మూడు కేసులు.. ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్ కు వారానికి ఐదారు కేసులు వస్తున్నాయని వైద్యాధికారులు చెప్తున్నారు. వీటితో పాటు జిల్లా, ఏరియా హాస్పిటల్స్ తో పాటు ప్రైవేట్ దవాఖానాల్లో నమోదవుతున్న కేసులను లెక్కలోకి తీసుకుంటే, ఈ సంఖ్య భారీగా ఉంటుంది. అయితే, మొత్తం పారాక్వాట్ కేసుల్లో 95 శాతం మంది చనిపోతున్నట్లు అధికారులు చెప్తున్నారు. మిగతా 5 శాతం మందిలో డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లినా తిరగబెట్టి మళ్లీ ట్రీట్మెంట్ కోసం వచ్చి కొందరు ప్రాణాలను కోల్పోయిన సందర్భాలు సైతం ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. నిమ్స్ హాస్పిటల్ లో గత ఐదేళ్లలో పారాక్వాట్ తాగి 500 మంది రాగా, వారిలో 95 శాతం మంది మరణించారు. కాగా, మృతుల్లో 46 శాతం మంది యువతే ఉండడం ఆందోళనకరం. ఇందులో 80 శాతం మంది పురుషులు కాగా, 20 శాతం మహిళలు ఉంటున్నారు. ఇవి కేవలం ఒక్క నిమ్స్ దవాఖాన లెక్కలు మాత్రమే కాగా, ఉస్మానియా, గాంధీ, ప్రైవేట్ కార్పొరేట్ దవాఖానలకు వచ్చే కేసులను కూడా కలిపితే ఈ సంఖ్య వేలకు చేరుకుంటుంది. పైగా చాలామంది దవాఖానలకు తీసుకురాకుముందే ప్రాణాలు విడుస్తుండటంతో ఆ మరణాలు రికార్డుల్లోకి ఎక్కడం లేదు.
విరుగుడు లేదు..
పారాక్వాట్ డైక్లోరైడ్ అనేది అత్యంత వేగంగా గడ్డిని నాశనం చేసే మందు. స్విట్జర్లాండ్‌కు చెందిన సింజెంటా కంపెనీ గ్రామాక్సోన్ పేరుతో దీన్ని ప్రపంచవ్యాప్తంగా అమ్ముతోంది. ఇండియాలో కూడా అనేక కంపెనీలు దీన్ని తయారుచేసి అమ్ముతున్నాయి. పొలాల్లో గడ్డిపై స్ర్పేచేయగానే గంటల వ్యవధిలోనే గడ్డిని మాడ్చేస్తుంది. పనితీరు వేగంగా ఉండడం, ధర తక్కువ కావడంతో రైతులు దీని వాడకానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కానీ, మనుషుల పాలిట ఇది అత్యంత ప్రమాదకరంగా మారింది. కేవలం10–15 మిల్లీలీటర్ల మందు తాగినా ప్రాణాలు దక్కడం కష్టం. దీనికి కచ్చితమైన విరుగుడు (యాంటిడాట్) లేదు. మందు తాగిన వెంటనే నోరు మొక్కల మాదిరిగా మాడిపోతుంది. నేరుగా రక్తంలో కలిసి ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయాన్ని పాడు చేస్తుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల కణజాలం గట్టిపడి రాయిలా మారిపోతుంది. దీనినే వైద్య పరిభాషలో పల్మనరీ ఫైబ్రోసిస్ అంటారు. దీంతో బాధితుడికి శ్వాస అందక, వెంటిలేటర్ పై ఉంచినా ఫలితం ఉండదు. విలవిల కొట్టుకుంటూ, తీవ్ర నరకయాతన అనుభవించి మందు తాగిన కొద్దిరోజుల్లోనే చనిపోతారు. ఈ కారణంతో పాటు పంటలపై పిచికారీ చేయడం వల్ల ఇతర దుష్పరిణామాలు కూడా ఉంటాయి.
అసెంబ్లీ, పార్లమెంటులో ప్రస్తావన
పారాక్వాట్‌తో జరుగుతున్న ప్రాణనష్టం గురించి సిర్పూర్ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు గతంలో అసెంబ్లీలో మాట్లాడారు. తన నియోజకవర్గానికి చెందిన కార్యకర్త ఒకరు సూసైడ్ చేసుకోవాలని పంటలకు కొట్టే ఓ మందు తాగితే చనిపోలేదని, రెండోసారి పారాక్వాట్ తాగి ప్రాణాలు కోల్పోయాడని సభలో ఆవేదన వ్యక్తం చేశారు. విషపూరితమైన ఈ మందును తెలంగాణలో బ్యాన్ చేయాలని కోరారు. పారాక్వాట్‌ను క్షణికావేశంలో తాగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కూడా గతంలో పార్లమెంట్‌సమావేశాల్లో ప్రస్తావించారు. ఈ గడ్డి మందును నిషేధించాలని కోరారు.
ప్రత్యామ్నాయంగాగ్లైఫోసేట్, గ్లూఫోసినేట్
పారాక్వాట్‌కు బదులుగా గ్లైఫోసేట్, గ్లూఫోసినేట్ వంటి కలుపు మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి పారాక్వాట్ అంత వేగంగా పనిచేయకపోయినా మనుషులకు అంత ప్రమాదకరం కాదు. కానీ, ఈ ప్రత్యామ్నాయ మందుల గురించి రైతులకు అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. కేవలం సబ్సిడీలకే పరిమితమైన ఆ శాఖ, రైతులకు చైతన్యం కలిగించడంలో చేతులెత్తేసిందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పారాక్వాట్‌ను రాష్ట్రవ్యాప్తంగా నిషేధించాలని, రైతులకు ప్రత్యామ్నాయ మందులపై అవగాహన కల్పించి, వాటిని సబ్సిడీపై అందించాలని కోరుతున్నారు.
పారాక్వాట్ బ్యాన్ కోసం డాక్టర్ల పోరుబాట
తమ కండ్ల ముందే నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే చూడలేక, బాధితులను కాపాడడానికి మరో మార్గం లేక.. పారాక్వాట్ ను బ్యాన్ చేయాలని డాక్టర్లు పోరుబాట పట్టారు. ఖమ్మం, మంచిర్యాల జిల్లాలకు చెందిన పలువురు డాక్టర్ల ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చిలో 'డాక్టర్స్ అగైనెస్ట్ పారాక్వాట్ పాయిజనింగ్(డీఏపీపీ)'ను ఏర్పాటు చేశారు. ఇందులో రాష్ర్టవ్యాప్తంగా140 మంది డాక్టర్లు మెంబర్లుగా ఉన్నారు. వీరు 'బ్యాన్ పారాక్వాట్, సేవ్ సొసైటీ, సేవ్ ఫార్మర్స్, సేవ్ హ్యూమన్' నినాదంతో పారాక్వాట్బ్యాన్కోసం పోరాడుతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ ఉప రాష్ర్టపతి ఎం.వెంకయ్య నాయుడుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులను, కలెక్టర్లను కలిసి పారాక్వాట్వల్ల జరుగుతున్న ప్రాణనష్టం గురించి వివరించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు. సెంట్రల్అగ్రికల్చర్, ఫర్టిలైజర్స్ మినిస్టర్లను కలవాలని కూడా ప్రయత్నిస్తున్నారు. కాగా, డీఏపీపీ స్టేట్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ సతీష్నారాయణ చౌదరి(ఎమర్జెన్సీ మెడిసిన్, ఖమ్మం), వైస్‌ప్రెసిడెంట్‌గా డాక్టర్ రాకేశ్‌కుమార్ చెన్న(నెఫ్రాలజీ, మంచిర్యాల) ఉన్నారు.
32 దేశాల్లో నిషేధం..
ప్రపంచవ్యాప్తంగా 32 దేశాలు పారాక్వాట్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాయి. మన దేశంలో కేరళ, ఒడిశా ప్రభుత్వాలు కూడా బ్యాన్ చేశాయి. కానీ, మన రాష్ట్రంలో మాత్రం దీని అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఫర్టిలైజర్ షాపుల్లోనే కాకుండా, ఎలాంటి లైసెన్సులు లేని దుకాణాల్లోనూ ఇది దొరుకుతోంది. ఆన్ లైన్ ఈ-కామర్స్ సైట్లలోనూ క్లిక్ చేస్తే ఇంటికి వచ్చేంత తేలిగ్గా మారింది. ప్రాణాలు తీస్తున్న ఈ కిల్లర్ మందును రాష్ట్రంలో ఎందుకు నిషేధించడం లేదని సామాజిక కార్యకర్తలు, డాక్టర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పారాక్వాట్ అమ్మకాలను నిషేధించాలని, రైతులకు ప్రత్యామ్నాయ మందులపై సబ్సిడీలు ఇచ్చి, వారిలో చైతన్యం తీసుకురావాలని కోరుతున్నారు. లేకపోతే పల్లెల్లో పారాక్వాట్ సృష్టిస్తున్న ఈ మృత్యుఘోషకు అడ్డుకట్ట వేయడం అసాధ్యమని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
స్పెషలిస్టు డాక్టర్లు ఏమంటున్నారంటే..
పారాక్వాట్ గడ్డిమందు మొదట కిడ్నీలనే టార్గెట్చేస్తుందని -నిమ్స్ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ హెచ్‌వోడీ డాక్టర్ భూషణ్ రాజ్ అంటున్నారు. శరీరంలోకి చేరిన పారాక్వాట్ ను బయటకు పంపేందుకు కిడ్నీలు ప్రయత్నించి దెబ్బ తింటాయన్నారు. దీంతో మూత్రం ఆగిపోయి, శరీరం నుంచి విషం బయటకు పోక మరణం సంభవిస్తుందన్నారు. నిమ్స్ జనరల్‌మెడిసిన్ హెచ్ఒడీ డాక్టర్ సుబ్బలక్ష్మి, నిమ్స్ పల్మనాలజీ, హెచ్ఓడీ డాక్టర్ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. పారాక్వాట్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపి, పల్మనరీ ఫైబ్రోసిస్ ఏర్పడి మరణానికి దారితీస్తుందన్నారు. స్పాంజ్ మాదిరిగా ఉండే లంగ్స్ ఈ మందు ప్రభావంతో రాయిలా గట్టిపడి, ఆక్సిజన్ గ్రహించే శక్తిని పూర్తిగా కోల్పోతాయన్నారు. ఈ దశలో రోగికి ఎంత ఆక్సిజన్ అందించినా, అది రక్తంలోకి చేరదని, చివరికి లంగ్స్ పూర్తిగా పనిచేయడం ఆగిపోయి చావుకు దగ్గరవుతారని వివరించారు.
బ్యాన్ చేయించేందుకు చర్యలు
పారాక్వాట్ అత్యంత విషపూరితం కావడంతో అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా వారిని కాపాడలేకపోతున్నారు. దీర్ఘకాలంలో నేలకు కూడా ఇది మంచిది కాదని అగ్రికల్చర్ సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మందును బ్యాన్ చేయాలని సూచనలు వచ్చాయి. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి బ్యాన్ చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
-దామోదర రాజనర్సింహా, హెల్త్ మినిస్టర్
