విజయవాడ: మోంథా తుఫాను ప్రభావంతో విజయవాడ, విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే 122 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. 29 రైళ్లను దారి మళ్లించింది. విజయవాడ, విశాఖపట్నం మధ్య రైళ్ల రాకపోకలు పూర్తిగా బంద్ అయిన పరిస్థితి ఉంది. అంతేకాదు.. బెంగళూరు, చెన్నై నుంచి హౌరా, సికింద్రాబాద్ మీదుగా వెళ్లే పలు రైళ్లను కూడా రద్దు చేశారు. మోంథా తుఫాన్ కారణంగా ఇప్పటివరకూ మొత్తం 160 రైళ్లు రద్దు కావడంతో రైలు ప్రయాణికులు ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. ఈస్ట్ కోస్ట్ పరిధిలో విజయనగరం, విశాఖ మీదుగా.. రాజమండ్రి, మచిలీపట్నం, గుంటూరు, తిరుపతి, చెన్నై, సికింద్రాబాద్ రైళ్లు రద్దయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు రద్దు చేశారు. నేడు, రేపు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.
ఇక మోంథా తుఫాను ప్రభావం విషయానికొస్తే.. అంతర్వేదిపాలెం దగ్గర మోంథా తుఫాను తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటడానికి 4 గంటల సమయం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రాజోలు అల్లవరం మధ్య తుఫాన్ బీభత్సం సృష్టించింది. అంతర్వేది దగ్గర అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. లైట్ హౌస్ కట్టడాలను సముద్రపు అలలు తాకుతున్నాయంటే తుఫాను ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజోలు నియోజకవర్గం అంధకారంలో కూరుకుపోయింది. పలు చోట్ల సెల్ టవర్స్ దెబ్బతిని ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ అందుబాటులో లేకుండా పోయింది.
ప్రకాశం జిల్లాలో కూడా కుండపోత వర్షం కురిసింది. సింగరాయకొండ పోలీస్ స్టేషన్ నీటమునిగింది. ఒంగోలు సమీపంలో కారు కొట్టుకుపోయింది. సిగ్నల్స్ లేకపోవటంతో మొబైల్ నెట్‌వర్క్‌లు పనిచేయడం లేదు. కైకలూరులో కూడా భారీ వర్షం కురిసింది. రాబోయే 8 నుంచి 10 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల నుంచి -20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
